ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధుకు నిరాశ.. ఆన్ సే యంగ్ చేతిలో వరుసగా 11వ సారి ఓటమి

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధుకు నిరాశ.. ఆన్ సే యంగ్ చేతిలో వరుసగా 11వ సారి ఓటమి

ఫ్రెంచ్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. వరల్డ్ నంబర్ 1 ఆన్ సే యంగ్‌తో మూడు గేమ్‌ల పాటు పోరాడినా ఓడిపోయింది. ఆదివారం (అక్టోబర్ 25) జరిగిన ఈ మ్యాచ్‌లో రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు 16-21, 21-11, 21-12 తేడాతో సౌత్ కొరియన్ స్టార్ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అరేనా గ్రాండ్ పారిస్‌లో గంటకు పైగా హోరాహోరిగా సాగింది.

ప్రపంచ ర్యాంకింగ్‌లో 11వ స్థానంలో ఉన్న సింధు తన ఏడవ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్, ఈ సీజన్‌లో రెండవ టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలైలో జపాన్ ఓపెన్ గెలిచిన సింధు, ఆన్ సే యంగ్‌ చేతిలో ఓడిపోయింది. ఆన్ సే యంగ్ చేతిలో పీవీ సింధు ఓడిపోవడం వరుసగా ఇది  11వ సారి  కావడం గమనార్హం. 

ఫస్ట్ గేమ్‌లో సింధు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. స్టాటింగ్ లో ఇరువురూ సమానంగా ఉండగా, 11-ఆల్ తర్వాత సింధు ఆధిక్యం సాధించి మొదటి గేమ్ గెలుచుకుంది. ఆన్ సే యంగ్‌తో జరిగిన 11 మ్యాచ్‌లలో సింధు ఒక గేమ్ గెలవడం ఇది కేవలం రెండవసారి మాత్రమే. గతంలో 2023 బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌ల క్వార్టర్ ఫైనల్‌లో ఆమె మొదటి గేమ్ గెలిచినా, చివరికి ఓడిపోయింది.

రెండో గేమ్‌లో ఆన్ సే యంగ్ పుంజుకుంది.  ఇంటర్వెల్ దగ్గర 11-7 ఆధిక్యం సాధించి, తర్వాత స్కోర్‌ను సమం చేసుకుంది. మూడో గేమ్ ప్రారంభంలో సింధు కొంతవరకు తట్టుకున్నా, ఆన్ సే యంగ్ క్రమంగా డామినెన్స్ చేసింది. ఆరు వరుస పాయింట్లు సాధించి 15-9 ఆధిక్యం సంపాదించి, చివరికి టైటిల్ సొంతం చేసుకుంది.

సింధు రన్నరప్‌గా నిలవడంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్ మహిళల సింగిల్స్ ఛాంపియన్‌ ఇంకా  కలగానే మిగిలిపోయింది.  1998లో అపర్ణా పోపట్ చివరిసారి టైటిల్ గెలుచుకోగా, సైనా నెహ్వాల్ 2012లో రన్నరప్‌గా నిలిచింది.