సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. రంగంలోకి సీఐడీ..14 మంది మిల్లర్లు అరెస్ట్

సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. రంగంలోకి  సీఐడీ..14 మంది మిల్లర్లు అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణలో సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్ ప్రక్రియ, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా వ్యవహారాలపై విచారణ చేపట్టారు. సన్న బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, అందుకు బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

16 రైస్ మిల్లులపై ఆరోపణలు

నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులపై అక్రమాల ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కారణంగా బోనస్ రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

మరోవైపు, 45,414.833 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం కేటాయించిన వ్యవహారం కూడా విచారణలో ఉన్నట్లు సమాచారం. ఈ కేటాయింపులకు సంబంధించి బోనస్ పరంగా సుమారు రూ.242 కోట్ల మేర ఆర్థిక ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ మొత్తానికి సంబంధించిన తుది ఆర్థిక నష్టం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.సివిల్ సప్లైస్ అధికారుల జోక్యంతో తదుపరి నష్టం జరగకుండా నివారించినట్లు సమాచారం. ధాన్యం కేటాయింపులు, బియ్యం నాణ్యత, సరఫరా రికార్డులు, బోనస్ చెల్లింపులకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు క్రిమినల్ కేసులు..14 మంది మిల్లర్ల అరెస్ట్

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే 14 మంది మిల్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సన్న రకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి, ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు లభించే బియ్యాన్ని సేకరించి ఎఫ్‌సీఐకి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల వెనుక మిల్లర్ల పాత్రతో పాటు అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా, ధాన్యం కేటాయింపులు, బియ్యం సరఫరాలో కుట్ర జరిగిందా అనే కోణాల్లోనూ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ధాన్యం కేటాయింపుల నుంచి బియ్యం సరఫరా వరకు జరిగిన ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యం సరఫరా జరిగిందా? ప్రభుత్వ బోనస్‌ను దుర్వినియోగం చేశారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.