గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు.?

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు.?

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కత్తితో బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాధితుడు శ్యాం నాగ్ ఆరోపిస్తున్నారు.ఈ  ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనకాపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యాం నాగ్ గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి తన చిన్ననాటి స్నేహితుడు భార్గవ్ రాజ్‌తో కలిసి గోపన్‌పల్లిలోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించాడు. అనంతరం ఇద్దరూ భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లారు.

అదే సమయంలో ఇన్నోవా కారులో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శ్యాం నాగ్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్లు అతడి స్నేహితుడు భార్గవ్ రాజ్ ఆరోపించాడు. వెంటనే డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడి కోసం గాలింపు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు శ్యాంను నిర్మానుష్యంగా ఉన్న ఓ నిర్మాణంలోకి తీసుకెళ్లినట్లు సమాచారం.

పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి కిడ్నాప్‌కు గురైన శ్యాం నాగ్‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తనను కత్తితో బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు . భార్గవ్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, బాధ్యుల వివరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.