- కారులో రూ.2.40 లక్షలు స్వాధీనం!
హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ జాయింట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ ఏసీబీకి చిక్కా రు. ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో అక్రమంగా వసూలు చేసిన రూ.2.40 లక్షల నగదును కారులో ఇంటికి తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డారు. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. శ్రీనివాస్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖైరతాబాద్‌లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయం నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును ఓ ఉన్నతాధికారి కారులో తీసుకెళ్తున్నారంటూ ఏసీబీ అధికారులకు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో రాజ్ భవన్ రోడ్డులో నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. మెట్రో రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ ఎదురుగా వస్తున్న మారుతి స్విఫ్ట్ కారును అడ్డగించి తనిఖీ చేయగా, అది వాటర్ బోర్డు జేడీ ఏ. శ్రీనివాస్‌కు చెందినదిగా తేలింది.
