న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీఐ) ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కీలక వివరాలను దాస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. సర్‌లో సాఫ్ట్వేర్, ఏఐ వినియోగంపై పారదర్శకత లేదన్నారు. ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఓ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు. ఎస్ఐఆర్లో వాడుతున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించాలని సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఈసీఐ నిరాకరించిందని ఆరోపించారు.
సాఫ్ట్‌వేర్‌ను ఎవరు అభివృద్ధి చేశారు? ఏఐని వాడుతున్నారా? వాడితే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిందనే విషయం కూడా బహిరంగంగా వెల్లడించలేదని విమర్శించారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈసీఐనెట్ సాఫ్ట్వేర్, ఐటీ విభాగం పనితీరుపై అభ్యంతరాలు లేవనెత్తినట్టు జైరాం రమేశ్ పేర్కొన్నారు.
