బాకు: ఫిఫా అండర్–15 వరల్డ్ కప్ అండ్ ఫెస్టివల్ టోర్నీలో భారత యువ ఫుట్‌బాలర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఆదివారం గ్రూప్–కె మ్యాచ్‌లో కామెరూన్‌పై 2–1తో విజయం సాధించారు. దీంతో టోర్నీలో వరుసగా రెండో గెలుపును ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. వర్షం కురుస్తున్న పరిస్థితుల్లోనూ భారత జట్టు ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలి నిమిషంలో దీపక్ సింగ్ అరంబమ్ కొట్టిన కార్నర్‌ను క్లియర్ చేసే క్రమంలో కామెరూన్ ఆటగాడు ఫారెల్ న్గోబో బంతిని సొంత గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. 20వ నిమిషంలో మహమ్మద్ సోహిల్ ఖాన్ చేసిన సెల్ఫ్ గోల్‌తో కామెరూన్ స్కోరు సమం చేసింది. రెండో అర్ధభాగంలో 27వ నిమిషంలో ఆర్. లాల్‌రెమ్రువాత్‌ఫెలా గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు.
ఆ తర్వాత గోల్‌కీపర్ జెనిట్ నింగ్తౌజామ్ అద్భుతంగా స్పందించాడు. పెనాల్టీని అడ్డుకోవడంతో పాటు ప్రత్యర్థి దాడులను నిలువరించి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఆదివారం గ్రెనడాతో, సోమవారం బహ్రెయిన్, సెనెగల్‌తో భారత్ ఆడనుంది.
