న్యూఢిల్లీ: ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషా ప్రశంసించారు. వారి పట్టుదల, కృషి లక్షల మందికి స్ఫూర్తినిస్తాయని ఆదివారం పేర్కొన్నారు. ఈ పోటీల్లో భారత్ 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో మొత్తం 114 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ‘ప్రతి పతకం వెనుక అథ్లెట్ల నిరంతర శ్రమ, అచంచలమైన సంకల్పం ఉన్నాయి.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాలను సాధించాలనే వారి తపన దేశానికి గర్వకారణం’ అని ఉషా సోషల్ మీడియా వేదికగా అభినందించారు. 2023 హాంగ్జౌ క్రీడల్లో భారత్ 108 పతకాలు సాధించగా, ఈసారి ఆ రికార్డును అధిగమించింది. పారా అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 65, పారా బ్యాడ్మింటన్‌లో 16, పారా స్విమ్మింగ్‌లో 11 పతకాలు దక్కాయి.
