- సర్ సాఫ్ట్వేర్ పేరు, వెర్షన్ వెల్లడించేందుకు నిరాకరణ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న వేళ ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల డేటాలోని లోపాలను గుర్తించడానికి తాము ఉపయోగించిన సాఫ్ట్వేర్ పేరు, దాని వెర్షన్ వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. ఈ సమాచారం వాణిజ్య విశ్వసనీయత (కమర్షియల్ కాన్ఫిడెన్స్), వాణిజ్య రహస్యాలు (ట్రేడ్ సీక్రెట్స్), మేధో సంపత్తి హక్కుల (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) కిందకు వస్తుందని, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్ 8(1)(డి) ప్రకారం దీనిని వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త ఎం.ఎ. ముజీబ్ అయ్యూబ్ దరఖాస్తు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు అక్టోబర్ 16న ఈసీ రాతపూర్వక బదులిచ్చింది. సర్ ప్రక్రియ కోసం కొత్తగా ఎటువంటి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని లేదా కొనుగోలు చేయలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓటరును జాబితాలో చేర్చడం లేదా తొలగించడం అనేది కేవలం వాస్తవాలు, రికార్డుల ఆధారంగా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్వోల) విచక్షణాధికారమని పేర్కొంది.
భిన్నమైన కారణాలతో తిరస్కరణ
ఓటర్ల డేటాలోని లోపాలను గుర్తించడానికి ఏఐ లేదా ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను వాడారా, తప్పుగా పేర్లు తొలగించకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, దీని వెనుక ఉన్న అధికారులెవరు అనే వివరాలను ముజీబ్ అయ్యూబ్ తన ఆర్టీఐలో కోరారు. ఈ ప్రశ్నలకు ఈసీ భిన్నమైన కారణాలు చూపుతూ తిరస్కరించింది. ఆటోమేటెడ్ సిస్టమ్స్, ఏఐ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలు 'సమాచారం' కిందకు రావని, అవి కేవలం 'స్పష్టతను' కోరేలా ఉన్నాయని తెలిపింది. తప్పులను సరిదిద్దే అధికారుల వివరాలను వెల్లడిస్తే అది ప్రాణాలకు ముప్పుగా మారుతుందని, గోప్యమైన వనరులను బయటపెట్టినట్లవుతుందని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జి)ని ఉదహరించింది.ఈ పరిణామాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్ స్పందిస్తూ.. ఈసీ దాటవేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు దరఖాస్తుదారుడు తదుపరి ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకోవాలని సూచించారు.
