అద్దె కట్టలేక.. నకిలీ నోట్ల ప్రింటింగ్..రూ.85 లక్షల నకిలీ కరెన్సీ గుర్తింపు

అద్దె కట్టలేక.. నకిలీ నోట్ల ప్రింటింగ్..రూ.85 లక్షల నకిలీ కరెన్సీ గుర్తింపు
  • రూ.85 లక్షల నకిలీ కరెన్సీ గుర్తింపు
  • ప్రింటర్‌‌‌‌‌‌‌‌, ఇతర సామగ్రి సీజ్‌‌‌‌‌‌‌‌

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌: అద్దె చెల్లించడానికి డబ్బులు లేక ఓ వ్యక్తి నకిలీ నోట్ల ముద్రణకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో వెలుగుచూసింది. అతడు అద్దెకు ఉంటున్న గదిలో పోలీసులు రూ.85 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పూర్తిగా ముద్రించిన రూ.37 లక్షల నకిలీ నోట్లు ఉండగా, మరో రూ.48 లక్షల నోట్లను ఒకవైపు మాత్రమే ముద్రించినట్లు గుర్తించారు. నోట్ల ముద్రణకు ఉపయోగించిన ప్రింటర్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర సామగ్రిని పోలీసులు సీజ్​చేశారు. 

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని ఖర్బీ ప్రాంతంలో పుష్పక్‌‌‌‌‌‌‌‌ కృష్ణ భండార్కర్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ బెండనే అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అతడి అద్దె ఒప్పందం జనవరిలో ముగిసినా గదిని ఖాళీ చేయలేదు. కొన్ని నెలలుగా అద్దె కూడా చెల్లించడం మానేశాడు. యజమాని రమేశ్‌‌‌‌‌‌‌‌ పలుమార్లు గదిని ఖాళీ చేయాలని కోరగా కత్తితో బెదిరించినట్లు సమాచారం. దీంతో రమేశ్‌‌‌‌‌‌‌‌ స్థానిక పీఎస్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై నాన్‌‌‌‌‌‌‌‌ కాగ్నిజబుల్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు చేశారు. 

ఆ తర్వాత పుష్పక్‌‌‌‌‌‌‌‌ ఆ గదికి రావడం మానేసి కనిపించకుండా పోయాడు. దీంతో యజమానికి అనుమానం వచ్చి  గదికి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ బకెట్‌‌‌‌‌‌‌‌లో కట్టలుగా ఉన్న నోట్లు, గది అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితాలు, ఓ ప్రింటర్‌‌‌‌‌‌‌‌ కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు నకిలీ కరెన్సీని సీజ్​చేసి పుష్పక్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా నిందితుడు ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించేందుకు సిద్ధమవుతున్నారు.