- రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం వెరిఫికేషన్ పూర్తి
- ఒక్క గ్రేటర్ పరిధిలోనే 3 వేలకు పైగా దరఖాస్తుల పెండింగ్
- అడ్రస్‌లు దొరక్క, సిబ్బంది లేక సిటీలో జాప్యం
- 5.98 లక్షల మంది దరఖాస్తుదారులకు తప్పని ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చేయూత కొత్త పింఛన్ల పంపిణీకి గ్రేటర్ హైదరాబాద్ అడ్డంకిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియ 97 శాతానికి పైగా పూర్తయినా.. ఒక్క హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో జాప్యం కారణంగా పెండింగ్ పడింది. గ్రేటర్ పరిధిలో ఇంకా 3 వేలకు పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తికాకపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 5.98 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దసరా నాటికే కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. సాంకేతిక, పరిశీలన లోపాల వల్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలిసింది.
కాగా, 33 జిల్లాల పరిధిలో చేయూత పింఛన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా.. మొత్తం 5,98,193 అర్జీలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాంగం వేగంగా స్పందించి దాదాపు అన్ని అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అర్హతలను పరిశీలించి ఆన్లైన్లో డేటా నమోదు చేశారు. కానీ గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రమంతా ఒకే విడతలో పింఛన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో.. గ్రేటర్‌లోని దరఖాస్తుల కోసం మిగిలిన ప్రక్రియ ఆలస్యమవుతోంది.
తలనొప్పిగా అడ్రస్ గుర్తింపు
గ్రేటర్ పరిధిలో వెరిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడానికి అధికారులు పలు కారణాలు చెబుతున్నప్పటికీ.. వారి అలసత్వమే ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో చాలామంది దరఖాస్తుదారులు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న సమయానికి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సమయానికివారు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, అడ్రస్సరిగా లేకపోవడం తదితర కారణాలతో లబ్ధిదారులు దొరకడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. అంతేకాదు, దరఖాస్తుల్లో పేర్కొన్న ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ రావడం, రాంగ్ నంబర్లు ఉండటంతో వారిని సంప్రదించడం అధికారులకు తలనొప్పిగా మారింది.
కొన్నిచోట్ల ఇంటి నంబర్లు అసంపూర్తిగా ఉండటం సమస్యగా మారింది. సిబ్బంది తనిఖీలకు వెళ్లిన సమయంలో ఉపాధి కోసం లబ్ధిదారులు బయటకు వెళ్లడం వల్ల ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయని పేర్కొన్నారు. దీనికితోడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్ సిబ్బంది కొరత ఉంది. ఇతర ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో సిబ్బందిని నిమగ్నం చేయడంతో పింఛన్ల వెరిఫికేషన్ ఆలస్యమవుతోందని సమాచారం.
సగానికిపైగా వితంతువుల అర్జీలే
కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా వితంతువుల నుంచే రావడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో చాలాకాలం పాటు కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులైన మహిళలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో వితంతువుల వాటానే 55 శాతానికి పైగా ఉంది. ఆ తర్వాత దివ్యాంగులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,98,193 అప్లికేషన్లలో వితంతువుల అర్జీలు 3,31,236 ఉండగా.. దివ్యాంగులు 1,48,882, ఒంటరి మహిళలు 62,689, గీత కార్మికులు 37,381, చేనేత కార్మికులు 18,005 మంది ఉన్నాయి. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయితేనే అర్హుల తుది జాబితాను రూపొందించి, ఆర్థిక శాఖ ఆమోదానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గ్రేటర్లో మిగిలిన 3 వేల దరఖాస్తుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అందుబాటులో లేనివారిని, అడ్రస్ దొరకని వారిని తాత్కాలికంగా పక్కనపెట్టి మిగిలిన అర్హుల జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే గ్రేటర్ వెరిఫికేషన్‌కు డెడ్‌లైన్ విధించి, త్వరలోనే పింఛన్ల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
