తెలంగాణలో సాగుకే ఎక్కువ కరెంట్!పంపు సెట్లకే రోజుకు 7 వేల మెగావాట్లు

తెలంగాణలో సాగుకే ఎక్కువ కరెంట్!పంపు సెట్లకే రోజుకు 7 వేల మెగావాట్లు
  •     పంపు సెట్లకే రోజుకు 7 వేల మెగావాట్లు
  •     రాష్ట్రంలో డైలీ 18 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం
  •     బయట నుంచి కొంటున్నదే ఎక్కువ 


హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇప్పటికీ పంటల సాగుకే ఎక్కువ కరెంట్ వాడకంలో ఉంది. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే వరికోతలు మొదలైనా విద్యుత్​వినియోగం మాత్రం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు సుమారు 7 వేల మెగావాట్ల విద్యుత్​ ఖర్చవుతుంది. ఆ తర్వాత గృహ, వాణిజ్య అవసరాలకు 4,500 మెగావాట్లు, ఐటీ, ఫార్మా, ఇతర  రంగాలకు 6,500  మెగావాట్ల వరకు విద్యుత్​ వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. మొన్నటిదాకా 20 వేల మెగావాట్ల రికార్డు స్థాయికి చేరుకున్న కరెంట్ వినియోగం.. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకు 18 వేల మెగావాట్లకు చేరుకున్నది. ఇందులో కూడా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్​ కంటే బయట నుంచి కొంటున్న కరెంటే ఎక్కువ. 

వ్యవసాయానికే 40% వాటా

ఈ ఖరీఫ్​ సీజన్​లో అనుకున్న స్థాయిలో వానలు పడకపోయినా వ్యవసాయ సాగు విస్తీర్ణం పెద్దగా తగ్గలేదు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు వేశారు. ఎల్​నినో ప్రభావంతో నీటి ఆధారిత పంటలైన వరి సాగు కొంత తగ్గగా పప్పు ధాన్యాలు, తోటల పెంపకం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా ఆహార పంటలు వరి 56.80 లక్షలు, మొక్కజొన్న 5.93 లక్షలు, జొన్నల సాగు సుమారు 35 వేలు, వాణిజ్య పంటలైన పత్తి 46.34 లక్షలు,  చెరకు 38 వేలు, పప్పుధాన్యాల సాగు 7.98 లక్షలు, సోయాబీన్ 3.67 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.సెప్టెంబర్​నుంచి విపరీతమైన ఎండలు, పొడివాతావారణంతో వ్యవసాయానికి నీటి వాడకం భారీగా పెరిగింది. వానాకాలం సీజన్​లో గత ఐదేండ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి బావులు, బోర్ల వద్ద పంపు సెట్లను రికాం లేకుండా వాడారు. సాగునీటి అవసరాల కోసం రైతులు పూర్తిగా బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకు పైగా ఫ్రీ వ్యవసాయ కనెక్షన్లు ఉండగా మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 40% వాటా 7 వేల మెగావాట్ల విద్యుత్​ డిమాండ్​ను ఈ రంగమే ఆక్రమించింది.

గృహ, వాణిజ్య అవసరాలకు 4,500 మెగావాట్లు

రాష్ట్రంలో ఉక్కపోత, వేడి వాతావరణంతో ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీలు, ఫ్యాన్లు విపరీతంగా వాడటంతో గృహ విద్యుత్ వినియోగం దాదాపు 25 శాతానికి పెరిగింది. గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించే కనెక్షన్లు 52.82 లక్షలు ఉండగా, వ్యాపార, వాణిజ్య, గృహేతర అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేటగిరి–2 విద్యుత్​ కనెక్షన్లు సుమారు 18 లక్షల వరకు ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లోనే ఎండాకాలం మాదిరిగా మారిన వాతావరణ పరిస్థితులతో 24 గంటల పాటు కరెంట్ వినియోగం విపరీతంగా పెరగడంతో రోజుకు సుమారు 4,500 మెగావాట్ల విద్యుత్​ ఈ విభాగంలో వినియోగిస్తున్నట్లుగా విద్యుత్​శాఖ ఇంజినీర్లు తెలిపారు.  

ఐటీ, ఫార్మా, ఇతర రంగాల్లోనూ భారీగా వాడకం

హైదరాబాద్​లోని వ్యాపార సముదాయాలు, మాల్స్, ఐటీ కారిడార్లలో విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అక్టోబర్​ నెలలో పీక్ డిమాండ్ 4,782 మెగావాట్లకు చేరింది. క్యూర్​ పరిధిలో విద్యుత్​ సేవలు అందించే సదరన్​ డిస్కమ్​ 12 వేల మెగావాట్ల పీక్​ డిమాండ్​ను దాటేసింది. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్ ఐటీ, ఇండస్ట్రియల్ సెక్టార్ల నుంచే ఉంటోంది. ఫార్మా, సిమెంట్ తయారీ రంగాలు, ఇతర భారీ పరిశ్రమల ద్వారా స్థిరమైన విద్యుత్ వినియోగం సుమారు 35 శాతంగా రికార్డు అవుతున్నది. హై వోల్టేజీ కనెక్షన్లు (హెటీ) ఉండే కమర్షియల్​ కాంప్లెక్స్, ఐటీ పార్కులు, పెద్ద షాపింగ్​మాల్స్, మల్టిఫ్లెక్స్​లు, స్టార్​హోటళ్లు,  హైదరాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, మెట్రో రైల్,  రైల్వే ట్రాక్షన్ అవసరాలు, లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం, పాలమూరు-–రంగారెడ్డి తదితర భారీ ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ స్టేషన్లు వంటి వాటితో ఈ రంగానికి విద్యుత్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీగా ఉన్నది. 

సగటున 18 వేల మెగావాట్లు

రాష్ట్రంలో ఈ నెల 16న విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 20,018 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతం రోజువారీ సగటు వినియోగం 18 వేల మెగావాట్లుగా ఉంది. గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజువారీ వినియోగం 245.35 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది 335.05 యూనిట్లకు పెరిగింది. రోజుకు సగటున 300 నుంచి 330 యూనిట్ల కరెంట్​ అవసరమవుతుండగా, ఇందులో 140 మిలియన్ యూనిట్ల వరకు  విద్యుత్​ను  ప్రభుత్వం కొంటుంది.