- ప్రపంచంలోని వెయ్యి నగరాల్లో 421వ స్థానం
- ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై కంటే బ్యాక్
- క్వాలిటీ లైఫ్‌లో 818.. ఎన్విరాన్మెంట్‌లో 657వ ర్యాంకు
- ఎకానమీ, హ్యూమన్ క్యాపిటల్‌లో మాత్రమే మెరుగు
- ట్రాఫిక్ జామ్, కాలుష్యం, ఇండ్ల ధరల మోతే ప్రధాన కారణం
హైదరాబాద్, వెలుగు: ఐటీ కంపెనీలు, ఫార్మా ఇండస్ట్రీలతో ఆర్థికంగా విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్.. జీవన ప్రమాణాల (క్వాలిటీ లైఫ్) విషయంలో మాత్రం మెప్పించలేకపోతున్నది. ఖర్చులు ఎక్కువని చెప్పుకునే ముంబైకన్నా మన హైదరాబాద్‌సిటీ ర్యాంకింగ్‌లో వెనుకబడింది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ ప్రపంచంలోని వెయ్యి నగరాలపై స్టడీ చేసి విడుదల చేసిన ‘గ్లోబల్ సిటీస్ ఇండెక్స్’లో 421వ స్థానంలో నిలిచింది.
మన దేశం నుంచి ఢిల్లీ ముందంజలో ఉండగా.. హైదరాబాద్‌కన్నా బెంగళూరు, ముంబై సిటీలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, విద్యా ఉపాధిలాంటి రంగాల్లో హైదరాబాద్ సిటీ నిలకడగా ఉన్నా.. క్వాలిటీ లైఫ్, పర్యావరణ విభాగాల్లో మాత్రం అట్టడుగు స్థానంలో ఉంది. మొత్తంగా ఓవరాల్ ర్యాంకులను పరిశీలిస్తే ఢిల్లీ 268వ ర్యాంకులో ఉండగా.. బెంగళూరు 311వ ర్యాంకును సాధించాయి. ముంబై 330వ స్థానంలో ఉండగా.. చెన్నై 381వ స్థానం, పుణె 427వ స్థానాల్లో ఉన్నాయి.
నగరంలో విస్తరిస్తున్న ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ఇంజినీరింగ్ వర్సిటీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్ ఎకానమీని నిలబెట్టినట్టు రిపోర్టు విశ్లేషించింది. దీంతో ఎకనామిక్స్‌లో 248, హ్యూమన్ క్యాపిటల్‌లో 241వ ర్యాంకు లభించింది. అయితే, ఆర్థిక రాజధాని ముంబై మన హైదరాబాద్ కన్నా మెరుగైన పొజిషన్‌లో ఉంది. హైదరాబాద్ సిటీ ఆర్థికంగా ఎంత ప్రగతి సాధిస్తున్నా.. ప్రజల రోజువారీ జీవన సౌలభ్యంలో ప్రతిఫలించడం లేదని నివేదిక స్పష్టం చేసింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో మన సిటీ 818వ స్థానానికి పరిమితమైంది. చివరికి ఆర్థిక రాజధాని ముంబై కంటే కూడా హైదరాబాద్ ఒక స్థానం దిగువన ఉండటం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఆదాయ అసమానతలు, విపరీతంగా పెరిగిన ఇండ్ల ధరలు, అద్దెలు, వైద్య ఖర్చులు అందుకు కారణమవుతున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ విభాగంలో హైదరాబాద్ 657వ ర్యాంకుకు పరిమితమైంది. ముంబై, ఢిల్లీల కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉన్నప్పటికీ.. బెంగళూరు కంటే వెనుకబడింది. గాలి నాణ్యత తగ్గడం, కర్బన ఉద్గారాలు పెరగడం, ప్రకృతి విపత్తులను తట్టుకునే సామర్థ్యం లోపించడంలాంటి అంశాలు ర్యాంకును దెబ్బతీశాయి.
ఎందుకీ దుస్థితి?
నగరంలో జీవన ప్రమాణాలు, పర్యావరణం దిగజారడానికి 4 అంశాలే కారణమని రిపోర్టు స్పష్టం చేస్తున్నది. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ ఇక్కట్లు, గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. నగర విస్తరణకు తగ్గట్టుగా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడకపోవడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయని, వర్షం వస్తే గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో గుంతల రోడ్లతో జనం నరకం చూస్తున్నారని రిపోర్ట్ అభిప్రాయపడింది. దాంతోపాటు ఆకాశాన్నంటిన ఇండ్ల అద్దెలు, ప్లాట్లు, -ఫ్లాట్ల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగిపోయిందని విశ్లేషించింది. వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోవడం, పచ్చదనం తగ్గిపోవడంతో నగర పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. జనాభా పెరుగుదలకు సరిపడా డ్రైనేజీ, తాగునీరు, ప్రజారోగ్య వసతులు అందకపోవడంతో జీవన నాణ్యత దిగజారుతోందని పేర్కొన్నది. అయితే, కేవలం ఐటీ ఎగుమతులు, భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఎకనామిక్ గణాంకాలను చూపించుకోవడం మాత్రమే నగర ప్రగతికి కొలమానం కాదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
