సన్న బియ్యం అమ్ముకొని..  దొడ్డు బియ్యం ఇచ్చిన్రు ..ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి రైస్ మిల్లర్ల టోకరా

సన్న బియ్యం అమ్ముకొని..  దొడ్డు బియ్యం ఇచ్చిన్రు ..ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి రైస్ మిల్లర్ల టోకరా
  • తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. 16 మిల్లులపై కేసులు
  • సివిల్ సప్లై కమిషనర్ ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ
  • 14  మంది మిల్లర్ల అరెస్ట్.. మూడు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు
  • తప్పిన 242 కోట్ల రూపాయల నష్టం 
  • స్కామ్‌‌‌‌‌‌‌‌లో అధికారుల పాత్రపైనా దర్యాప్తు 


హైదరాబాద్/ కరీంనగర్, వెలుగు: సన్న బియ్యం సరఫరా చేయాల్సిన కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి, భారత ఆహార సంస్థ (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ)కి టోకరా వేశారు. సివిల్ సప్లై శాఖ కేటాయించిన సన్నరకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచ్చిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కిలో రూ.50 వరకు అమ్ముకున్నారు. వాటి స్థానంలో బిహార్, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి కిలో రూ.28 చొప్పున కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి సరఫరా చేశారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ (ఈటీఎఫ్) తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ మూడు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేసి, ఆదివారం 14 మంది మిల్లర్లను అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌‌‌‌‌‌‌‌లో మిల్లర్లతోపాటు సివిల్ సప్లై అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.

సన్న బియ్యం సరఫరాకు అగ్రిమెంట్

2025–26 ఖరీఫ్ సీజన్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులోంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. 

అయితే కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకు బియ్యం చేరకపోవడంతో సివిల్ సప్లై శాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏడు జిల్లాల అడిషనల్ కలెక్టర్లు సన్న బియ్యాన్ని ఎఫ్‌‌సీఐకి సరఫరా చేసేందుకు అంగీకరించారు. గ్రేడ్‌‌-ఏ బియ్యాన్ని కామన్ రకంగా మార్చి సరఫరా చేసేందుకు అనుమతి కోరారు. కన్వర్షన్ కింద సన్న బియ్యానికి ఎఫ్‌‌సీఐ కిలోకు రూ.34 చెల్లిస్తుంది. 2.5 ఎంఎం పరిమాణం ఉండే బియ్యం సరఫరాపై వచ్చిన అభ్యర్థనలకు సివిల్ సప్లై కమిషనర్ అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నుంచి క్వింటాల్‌‌కు రూ.500 బోనస్‌‌తో సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించింది. అయితే కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచ్చిన సన్న బియ్యాన్ని కిలో రూ.50 వరకు మార్కెట్‌‌లో అమ్ముకున్నారు. వాటి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి కిలో రూ.28 చొప్పున దొడ్డు బియ్యం కొనుగోలు చేసి ఎఫ్‌‌సీఐకి సరఫరా చేశారు. ఇలా సన్న బియ్యం ఇవ్వాల్సిన చోట దొడ్డు బియ్యం పెట్టి అక్రమాలకు పాల్పడ్డారు.

శాంపిళ్ల పరీక్షలో బయటపడ్డ బాగోతం

మిల్లర్లు సరఫరా చేస్తున్న బియ్యంపై అనుమానాలు రావడంతో ఈటీఎఫ్ బృందాలు ఇటీవల విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఎఫ్‌‌సీఐ గోదాముల్లోని బియ్యం నమూనాలను సేకరించి ల్యాబ్‌‌కు పంపించగా, అవి సన్నరకం బియ్యం కాదని తేలింది. దీంతో నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులపై అధికారులు దృష్టి సారించారు. ఈ మిల్లుల నుంచి 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఎఫ్‌‌సీఐకి సరఫరా చేసినట్లు గుర్తించారు. సన్న ధాన్యానికి క్వింటాల్‌‌కు రూ.500 బోనస్ చెల్లించి సేకరించిన నేపథ్యంలో, దాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో ప్రభుత్వానికి బోనస్ రూపంలో సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. మరోవైపు, 45,414.833 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్‌‌కు కేటాయించిన వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ధాన్యాన్ని సైతం ఇదే విధంగా మిల్లింగ్ చేసి దొడ్డు బియ్యంగా సరఫరా చేసి ఉంటే ప్రభుత్వానికి బోనస్ రూపంలో దాదాపు రూ.242 కోట్ల నష్టం వాటిల్లేదని అంచనా వేశారు. అయితే సివిల్ సప్లై అధికారులు సకాలంలో స్పందించి స్టాప్ ఆర్డర్లు జారీ చేయడంతో ఈ నష్టం తప్పింది. ధాన్యం కేటాయింపులు, బియ్యం నాణ్యత, సరఫరా రికార్డులు, బోనస్ చెల్లింపులపై విచారణ కొనసాగుతోంది. రూ.242 కోట్ల నష్టంపై ఇంకా తుది నిర్ధారణ జరగాల్సి ఉంది.
కరీంనగర్, నిజామాబాద్, 
ములుగు జిల్లాల్లో అరెస్టులు
సివిల్ సప్లై శాఖ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌‌మెంట్) ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. కమిషనర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు మూడు ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసి 14 మంది మిల్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాధాకృష్ణ రైస్ మిల్ యజమాని లెంకలపల్లి మధు, లక్ష్మీ సాయి ఇండస్ట్రీస్ యజమాని సంపత్, లక్ష్మీ వెంకటరమణ రైస్ మిల్ యజమాని వల్లాల మల్లికార్జున్, హుజూరాబాద్‌‌కు చెందిన వరలక్ష్మి రైస్ మిల్ యజమాని కల్లూరి కృష్ణమూర్తి ఉన్నారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీమాత రైస్ మిల్స్ యజమాని బాదం ప్రవీణ్‌‌తోపాటు లేపాక్షి రైస్ మిల్ యజమాని మోహన్, సాయిరాం రైస్ మిల్ యజమాని రఘోత్తం, వాసవి రైస్ మిల్ యజమాని శ్రవణ్, ఎల్‌‌ఎస్‌‌ఆర్ రైస్ మిల్ యజమాని హరినాథ్ కూడా అరెస్టయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మిల్లర్ల వివరాలు తెలియాల్సి ఉంది.