Kangana Ranaut: 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో హారర్ మూవీ?

Kangana Ranaut: 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో హారర్ మూవీ?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ , తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం 'తను వెడ్స్ మను 3', 'క్వీన్ 2', ' సర్కిల్' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కంగనా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

రవిబాబు దర్శకత్వంలో హారర్ మూవీ?

తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు రవిబాబు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన మేకింగ్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా హారర్‌, థ్రిల్లర్‌ అంశాలను కొత్తగా చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకం. అలాంటి రవిబాబు దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ఓ హారర్‌ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. సినిమా షూటింగ్‌ సైతం ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, కంగనా తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రావడం విశేషం.

మళ్లీ టాలీవుడ్‌లోకి..

2009లో ప్రభాస్‌ హీరోగా నటించిన 'ఏక్ నిరంజన్‌' చిత్రంతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా కనిపించారు. ఆ తర్వాత నేరుగా తెలుగు సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు రవిబాబు దర్శకత్వంలో హారర్‌ చిత్రంతో రీఎంట్రీ ఇస్తారనే వార్త అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అదికారక ప్రకటన రావాల్సి ఉంది.