నర్మదా నదిలో కుప్పులుగా తేలుతున్న ఓటర్ కార్డులు..EC తీరుపై ఇంటర్నెట్ లో దుమారం

నర్మదా నదిలో కుప్పులుగా తేలుతున్న ఓటర్ కార్డులు..EC తీరుపై ఇంటర్నెట్ లో దుమారం

మధ్యప్రదేశ్ లో నర్మదానదిలో కుప్పకుప్పలుగా తేలుతున్న ఓటర్ కార్డులు కలకలం రేపుతున్నాయి. నది క్లీన్ చేస్తున్న సమయంలో ఓటర్లు కార్టులు తేలుతూ కనిపించడం చూసి స్థానికులు,అధికారులు అవాక్కయ్యారు. ఈ కార్డులన్నీ ఇండోర్ వాసులకు చెందినవిగా గుర్తించారు. అయితే ఖర్గోన్ జిల్లా మండలేశ్వర్ ప్రాంతంలో ఈ ఓటర్ కార్డులు లభించడం ఇప్పడు చర్చనీయాంశమైంది.  ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని వాడుకుంటూ బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన వెలుగు చూడటంతో ఈసీ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మండలేశ్వర్ వద్ద నర్మదా నది ఒడ్డున 343 ఓటరు గుర్తింపు కార్డులు (Voter ID cards) పడి ఉండటం కలకలం రేపింది.  నది ఒడ్డున స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో స్థానికులకు ఈ కార్డులు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.లభ్యమైన మొత్తం 343 ఓటరు కార్డులు ఇండోర్ జిల్లా పరిధిలోని రావు (Rau) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవిగా గుర్తించారు. ఆ కార్డులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలేశ్వర్ ఎస్‌డీఓ పోలీస్ శ్వేతా శుక్లా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నదిలో కార్డులను సేకరించేందుకు గజ ఈతగాళ్లతో ఆపరేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.

బీజేపీ, ఎన్నికల సంఘంపై ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయడం లేదని, ఓటర్ల లిస్టు, సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు, ఆందోళనలు చేస్తూనే ఉంది. ఈ ఘటన తమ ఆరోపణలను వాస్తవమే అని రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది.

ALSO READ : SIR సాఫ్ట్ వేర్ వివరాలను.. ఇచ్చేందుకు నిరాకరించిన ఈసీ!..

ఈ ఘటనపై  కాంగ్రెస్ X లో ఓ పోస్ట్ షేర్ చేసింది.  బీజేపీ, సీఈసీ ఓట్ల చోరీకి పాల్పడ్డారని అనడానికి ఆధారాలు ప్రతిరోజూ వెలుగు చూస్తున్నాయని ఆరోపించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను “జ్ఞాను” అని సంబోధిస్తూ, ఆ కార్డులు మహేశ్వర్‌కు ఎలా చేరాయని, వాటిని ఎవరు పారవేశారని, అవి నదీ తీరంలో ఎందుకు దొరికాయని ఆ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది.