వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తం.. మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చిట్ చాట్

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తం.. మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చిట్ చాట్
  • కేటీఆర్, హరీశ్కు ఫీల్డ్లో పరిస్థితులు తెలియవు
  • బీజేపీకి ఎనిమిదింటిలో ఒక్క సీటు కూడా రాదు
  • నవంబర్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తం
  • మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చిట్ చాట్

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకోవడమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అని పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ బలంగా ఉంటేనే  ప్రభుత్వంలో ఉంటామని అన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేస్తున్నామని, ఇప్పటికీ తమ పార్టీ ఉన్నంత బలంగా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇతర ఏ పార్టీ లేదని తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో మహేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్​ మీడియాతో చిట్‌‌‌‌‌‌‌‌ చాట్ చేశారు. 

నవంబర్‌‌‌‌లో నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, పార్టీపరంగా ఇతర సమస్యలు ఏవి ఉన్నా.. ఆ నెలలో అన్నింటినీ పరిష్కరించుకుంటామన్నారు. ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపైనే తమ దృష్టి అని చెప్పారు. సీఎం రేవంత్‌‌రెడ్డితో తనకు మంచి సమన్వయం ఉందని, తమ ఇద్దరి మధ్య ఉన్నంత సఖ్యత దేశంలో ఎవరికీ లేదన్నారు. పార్టీ వ్యవహారాల్లో సీఎం రేవంత్ తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు..
తెలంగాణలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని మహేశ్‌‌గౌడ్​ పేర్కొన్నారు. బీజేపీ పని అయిపోయిందని, రాష్ట్రంలో ఇప్పుడున్న 8 ఎమ్మెల్యే సీట్లలో తిరిగి ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోదని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో బీజేపీ గెలుచుకున్న 8 ఎంపీ సీట్లలో ఆ పార్టీ తిరిగి రెండు గెలుచుకుంటే ఎక్కువేనని అన్నారు. ఆదిలాబాద్,  నిజామాబాద్ జిల్లాల్లో 40 శాతం సీట్లు కాంగ్రెస్ కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌రెడ్డి మాటలు విన్నానని, పార్టీ దాన్ని పరిశీలిస్తుందని తెలిపారు.

క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటో తమకు తెలుసని, అవి కేటీఆర్, హరీశ్‌‌కు తెలియవని అన్నారు. వారు ఇంకా భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌ను మేధావి అనుకుంటామని, కానీ ఆయన ఆలోచన, ముందుచూపు లేకుండా అడ్డగోలుగా అప్పులు చేసి తెలంగాణను పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాడని మండిపడ్డారు. ఎల్‌‌నినోపై హరీశ్ పిచ్చిగా మాట్లాడుతున్నాడని, దేశమంతా ఈ సమస్య ఉంటే ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నట్టు మాట్లాడడం సరికాదన్నారు.