అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రం ‘హుషారు 2’. ఆర్.నారాయణమూర్తి కీలక పాత్ర పోషించారు. రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు కలిసి నిర్మించారు. రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’కు ఇది సీక్వెల్. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో డైరెక్టర్ హర్ష నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. ఇందులో ఎంత నవ్వించారో.. అంతకుమించి ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను గొప్పగా చూపించారు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. టీజర్‌ను మించి సినిమా ఉంటుందని అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ అన్నారు.
దర్శకుడు శ్రీహర్ష మాట్లాడుతూ ‘నా జీవితంలో నా స్నేహితులతో కలిసి చేసిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ తీశాను. మూర్తి గారితో వర్క్ చేయడం ప్రైస్ లెస్ మూమెంట్స్. ఆయనతో ఉండే సీన్స్ థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తనను తాను చూసుకున్నట్టుగా అనిపిస్తుందని నిర్మాత రాహుల్ వర్మ అన్నారు.
