వికారాబాద్, వెలుగు: బీజేపీ ఓటు చోరీకి పాల్పడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐసీసీ పరిశీలకుడు రంగరాజన్ మోహన్ కుమారమంగళం అన్నారు. ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రంగరాజన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు.
ఓటు హక్కును కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అక్టోబర్ చివరి నుంచి నవంబర్ 25 వరకు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి, ఓటు చోరీపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ అఫ్సర్ యూసుఫ్ జాహీ, పరిగి మున్సిపల్ చైర్పర్సన్ రజిత పాల్గొన్నారు.
