హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, ముంచుకొస్తున్న నీటి సంక్షోభం నేపథ్యంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ కేంద్రాల వల్ల తాగు, సాగునీరు, పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని స్వతంత్ర అధ్యయనాల ద్వారా తేలేవరకు ప్రభుత్వం ఎలాంటి కొత్త ఒప్పందాలు, హామీలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు హెచ్ఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్. కృష్ణ, ఎస్. జీవన్ కుమార్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉందని, రానున్న రోజుల్లో సాగునీరు అందించడం అసాధ్యమని, రైతులు ఒక పంట కాలాన్ని వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజలకు కనీసం తాగునీటి భరోసా కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటూ.. అపారమైన నీరు, విద్యుత్‌ను గుంజేసే భారీ ఏఐ డేటా సెంటర్లను రాష్ట్రానికి ఆహ్వానించడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. రైతుల అవసరాలను పక్కనపెట్టి బడా కార్పొరేట్ కంపెనీల కోసం ప్రాధాన్యతలను తలకిందులు చేయడం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.
