ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు ఎదురుదెబ్బ.. విజేతపై ఎటూ తేల్చని ఎగ్జిల్ పోల్స్

ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు ఎదురుదెబ్బ.. విజేతపై ఎటూ తేల్చని ఎగ్జిల్ పోల్స్

ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశంలో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాదని తేల్చాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూటమికి, మాజీ సైనిక చీఫ్ గాది ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 61 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దక్కేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ నెస్సెట్ లో మొత్తం స్థానాలు 120 ఉండగా  ప్రభుత్వం ఏర్పాటు కు 61 స్థానాలు అవసరం. నెతన్యాహు లికుడ్( నేషనల్ లిబరల్ మూవ్‌మెంట్) పార్టీకి  50 నుంచి 52 స్థానాలు, ప్రతిపక్ష గాది ఐసెన్‌కాట్ కూటమికి 51 నుంచి 53 స్థానాలు సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

నెతన్యాహుకు చెందిన  లికుడ్  పార్టీ 24నుంచి -27 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఐసెన్‌కాట్‌కు చెందిన యషార్ పార్టీ 21 స్థానాల వరకు గెలుచుకోవచ్చని చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో అరబ్ ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అరబ్ నేతృత్వంలోని జాయింట్ లిస్ట్, రామ్ (Raam) పార్టీలు కలిపి 17 నుంచి 19 స్థానాలు సాధించి కింగ్ మేకర్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 7, 2023 హమాస్ దాడి అనంతరం జరిగిన మొదటి జాతీయ ఎన్నికలు కావడంతో నెతన్యాహు సుదీర్ఘ పాలనపై ప్రజల అసంతృప్తి, యుద్ధాల నిర్వహణపై వ్యతిరేకత ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తోందని ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 77.7 శాతం ఓటింగ్ నమోదు కాగా అధిక సంఖ్యలో అరబ్ లు పాల్గొన్నట్లుసమాచారం.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమైతే, ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సుదీర్ఘమైన సంప్రదింపులు, కూటముల బేరసారాలు తప్పవు. ఒకవేళ ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోతే, దేశం మరోసారి ఎన్నికలకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 

ప్రస్తుతం  ఇజ్రాయెల్ లో అధికారిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి స్థాయి ఫలితాలపై  అక్టోబర్ 30 నాటికి స్పష్టత రానుంది.అధికారిక ప్రకటన నవంబర్ 4న వెలువడనుంది.