నెతన్యాహుకు అగ్నిపరీక్ష ..ఇజ్రాయెల్‌‌‌‌ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ 

నెతన్యాహుకు అగ్నిపరీక్ష ..ఇజ్రాయెల్‌‌‌‌ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ 
  • ఉదయం 10 గంటలకే 16.68%.. దశాబ్దాల గరిష్టం
  • 120 సీట్లు ఉన్న క్నెసెట్​లో మ్యాజిక్ ఫిగర్ 61 సీట్లు 

జెరూసలేం: ఇజ్రాయెల్‌‌‌‌లో జరుగుతున్న క్నెసెట్ (పార్లమెంటు) ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతోంది. పోలింగ్ స్టేషన్ల ముందు ఓటర్లు బారులు తీరారు. మంగళవారం ఉదయం 10 గంటలకే రికార్డు స్థాయిలో 16.68 శాతం పోలింగ్ నమోదైంది. సైనికుల్లో 30% మంది ఉదయమే ఓటేశారు. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత పోలింగ్ జరగడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నది. మరోవైపు, 2023 అక్టోబర్ నెలలో హమాస్ చేసిన దాడి తర్వాత దేశంలో జరుగుతున్న తొలి జాతీయ ఎన్నికలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధాన్ని నడిపిస్తున్న ప్రస్తుత ప్రధాని నెతన్యాహుకు ఈ ఎన్నికలు రాజకీయ అగ్నిపరీక్షగా మారయి. మాజీ సైనికాధిపతి, యషార్ పార్టీ నేత గాడి ఐసెన్‌‌‌‌కోట్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం 73.3 లక్షల ఓటర్లలో 3.3 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్న యువతే కావడం విశేషం.

సరిహద్దు నుంచే సమరం

గాజా యుద్ధంలో తన కుమారుడిని, ఇద్దరు మేనల్లుళ్లను కోల్పోయిన ప్రతిపక్ష నేత ఐసెన్‌‌‌‌కోట్.. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న సరిహద్దు గ్రామం ‘కిబ్బుట్జ్ నిర్ ఓజ్’ లో మాజీ బందీ గాడి మొజెస్‌‌‌‌తో కలిసి నడిచి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉంటే పాలకులంతా ఈ రోజు గాజా సరిహద్దు గ్రామాల్లోనే గడపాలని నెతన్యాహుపై విమర్శలు గుప్పించారు. నెతన్యాహు మద్దతుదారులు మాత్రం ఈ సంక్షోభ సమయంలో దేశానికి అనుభవజ్ఞుడైన నేత అవసరమని వాదిస్తున్నారు.

ఓట్ల కుట్రపై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు ‘డెరెచ్’ ఉన్న బ్యాలెట్ స్లిప్పులను కొన్నిచోట్ల మాయం చేశారని, మరికొన్ని చోట్ల చింపేసి పెన్నులతో గీతలు గీశారని ఐసెన్‌‌‌‌కోట్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఫిర్యాదు చేసింది. 223 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 12,018 పోలింగ్ కేంద్రాల్లో 15 వేల కెమెరాల నిఘా మధ్య పోలింగ్​జరుగుతున్నది. 

61 సీట్లే మ్యాజిక్ ఫిగర్

మొత్తం 120 సీట్లు ఉన్న పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్ల స్పష్టమైన మెజారిటీ అవసరం. ప్రధాన కూటములకు మెజారిటీ రాకపోతే 20% జనాభా ఉన్న అరబ్ పార్టీలు కింగ్‌‌‌‌మేకర్‌‌‌‌గా మారే అవకాశం ఉంది. ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు గరిష్టంగా 42 రోజుల గడువు ఇస్తారు. ఈలోగా ఏ కూటమి కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోతే దేశం మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. 

నెతన్యాహుకు ట్రంప్ సంపూర్ణ మద్దతు

ఇజ్రాయెల్‌‌‌‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నెతన్యాహును అత్యంత బలమైన, ధైర్యవంతుడైన లీడర్​గా పేర్కొంటూ, ఇజ్రాయెల్ పౌరులు ఆయనకే ఓటేయాలని పిలుపునిచ్చారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నెతన్యాహు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడంలో నెతన్యాహు తమకు ఒక గొప్ప భాగస్వామి అని పేర్కొన్నారు.