ట్రంప్‌‌‌‌పై అత్యాచార ఆరోపణలు! ..తనను రేప్ చేశాడన్న మాజీ మిస్ స్విట్జర్లాండ్ 

ట్రంప్‌‌‌‌పై అత్యాచార ఆరోపణలు! ..తనను రేప్ చేశాడన్న మాజీ మిస్ స్విట్జర్లాండ్ 
  • డెమోక్రాట్ల 53 పేజీల రిపోర్టు.. ఖండించిన వైట్‌‌‌‌హౌస్
  • ప్రతిపక్షాల విమర్శలు.. ప్రత్యేక దర్యాప్తుకు డిమాండ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మాజీ మిస్ స్విట్జర్లాండ్, ప్రముఖ మోడల్ బీట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన జుడీషియరీ కమిటీ డెమోక్రాట్ (ప్రతిపక్ష) సభ్యులు విడుదల చేసిన 53 పేజీల అఫీషియల్ రిపోర్టులో ఈ షాకింగ్ అంశాలను పేర్కొన్నారు. 1993 నవంబర్‌‌‌‌లో అట్లాంటిక్ సిటీలోని ‘ట్రంప్ ప్లాజా హోటల్’ గదిలో ఈ ఘోరం జరిగిందని ఆమె వివరించారు. ఈ వ్యవహారంపై ఇండిపెండెంట్​ కౌన్సిల్​ఇన్వెస్టిగేషన్ జరిపించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తుండగా, వైట్‌‌‌‌హౌస్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. రిపబ్లికన్ల విజయాన్ని తట్టుకోలేక డెమోక్రాట్లు చేస్తున్న తప్పుడు ప్రచారంగా దీన్ని కొట్టిపారేసింది.

నమ్మించి మోసం చేశారు: బీట్రిస్ క్యూల్

అందాల పోటీల సమయంలో ట్రంప్‌‌‌‌ను తాను తొలిసారి కలిశానని బీట్రిస్ క్యూల్ తెలిపారు. అమెరికా వీసా ఇప్పిస్తానని, యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని ఆశ చూపి, తన ప్రతినిధుల ద్వారా హోటల్ పైఅంతస్తు గదికి పిలిపించుకున్నారని చెప్పారు. గదిలోకి వెళ్లగానే ట్రంప్ తనపై క్రూరంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సమయంలో తనకు గాయాలై రక్తస్రావమైందని నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ నోరు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

 మైనర్ల అక్రమ రవాణా కేసులో జైలులో ఉంటూ 2019లో చనిపోయిన జెఫ్రీ ఎప్‌‌‌‌స్టీన్‌‌‌‌తో ట్రంప్‌‌‌‌కు ఉన్న పాత రిలేషన్స్ వల్లే ఇలాంటి ఘోరాలు జరిగాయని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఎప్‌‌‌‌స్టీన్ సమక్షంలో ట్రంప్ తమపై లైంగిక దాడి చేశారని ఇప్పటివరకు ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారని కమిటీ సీనియర్ నేత జామీ రాస్కిన్ పేర్కొన్నారు. ట్రంప్‌‌‌‌ను కాపాడేందుకు న్యాయశాఖ ప్రయత్నిస్తోందని, అందుకే నిష్పాక్షిక దర్యాప్తు కావాలని వారు కోరుతున్నారు. అయితే తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు.