- రాహుల్పై బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శ
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకున్నంత మాత్రాన దానిపై పట్టు ఉన్నట్లు కాదని, నిబంధనలను చదివి అర్థం చేసుకున్నప్పుడే నిజమైన పరిరక్షకులవుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సీఈసీని తొలగించాలని ప్రధాని మోదీని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరడం రాజ్యాంగ ప్రక్రియలపై అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని, ప్రతిపక్ష నేత ఎవరైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని ఇష్టానుసారం తొలగించలేరన్నారు. ఆర్టికల్ 324(5), 124(4) ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి మాత్రమే సీఈసీని తొలగించగలరని తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకే అంబేద్కర్ ఈ రక్షణలు కల్పించారని గుర్తుచేశారు. సీఈసీపై అభ్యంతరాలుంటే ఆధారాలతో రాజ్యాంగబద్ధ ప్రక్రియను అనుసరించాలని, రాజకీయ డ్రామాలు మానుకోవాలని రాహుల్కు సూచించారు.
