- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల మీటింగ్
గజ్వేల్/ ములుగు, వెలుగు: రేషన్ డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్ల సంఘాన్ని చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి డీలర్లు హాజరయ్యారు.
రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్ ఇవ్వడంతోపాటు, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి అన్ని రకాల సరుకులు విక్రయించుకునే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా డీలర్ల సమస్యలను పరిష్కరించలేదని, కనీసం సంఘం ప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు రావడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గోదాములు, రేషన్ షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని సకాలంలో వేలం వేయకపోవడంతో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుతం టెండర్లు పిలిచి, 16 నెలల కింద రేషన్ షాపుల్లో ఉన్న స్టాక్ లెక్కల ప్రకారం బియ్యాన్ని తూకం వేసి ఇవ్వాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
చనిపోతేనే బిల్లులు ఇస్తారా?
తాను చనిపోతేనే బిల్లులు ఇస్తారా ? అని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారని, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు చెప్తున్నారని, కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అధికార పార్టీ ఎమ్మెల్యేనే చచ్చిపోవడానికి సిద్ధమనే దుస్థితి వచ్చిందని విమర్శించారు. ఎవరూ చచ్చిపోవద్దని, అందరం కలిసి గట్టిగా కొట్లాడి బిల్లులు, డిమాండ్లు సాధించుకుందామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ డీలర్ల ప్రతినిధులతో రెండురోజులు చర్చలు జరిపి కేసీఆర్ ని ఒప్పించి కమీషన్‌ను రూ.140 కి పెంచినట్టు గుర్తు చేశారు. పన్నులు, అధికారుల వేధింపులతో డీలర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ధరావత్ మోహన్ నాయక్, అజీజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.
