వెలుగు జర్నలిస్టుకు అక్కినేని మీడియా ప్రతిభా పురస్కారం

వెలుగు జర్నలిస్టుకు అక్కినేని మీడియా ప్రతిభా పురస్కారం
  • రవీంద్రభారతిలో అక్కినేని మీడియా పురస్కారాల ప్రదానం

రవీంద్రభారతి, వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శృతిలయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ‘అక్కినేని మీడియా ప్రతిభా పురస్కారాలు’ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీడియా ప్రతినిధులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులు అందజేశారు. 

ఈ సందర్భంగా వెలుగు దినపత్రిక స్టేట్‌‌ బ్యూరో రిపోర్టర్‌‌ అరుణ్‌‌కుమార్‌‌ అవార్డు అందుకున్నారు. నమస్తే తెలంగాణకు చెందిన రఘురాములు, మహా న్యూస్‌‌కు చెందిన కృష్ణమూర్తి, ఆంధ్రప్రభకు చెందిన డాక్టర్‌‌ మారం శ్రీనివాస్‌‌ జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నారు.

వివిధ చానెళ్లు, పత్రికలకు చెందిన విజయచంద్రిక, ప్రభాకర్‌‌, జితేందర్‌‌, మంజుల, అక్షయ, సంధ్య, ప్రియాంక, ధనలక్ష్మి, బ్రాహ్మణిలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. మైనారిటీ మోర్చా నాయకుడు షేక్‌‌ షాజహాన్‌‌ను అక్కినేని స్ఫూర్తి పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కుసుమ, భోగరాజు, నరహరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్‌‌ హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ మాజీ చైర్మన్‌‌ కోలేటి దామోదర్‌‌గుప్త మాట్లాడుతూ న్యూస్‌‌ ప్రెజెంటర్లు కూడా కళాకారులేనని, వారికి ప్రభుత్వాలు అవార్డులతో తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్‌‌ పి.విజయబాబు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.