ఇందిరమ్మ టవర్ల కేటాయింపునకు కొత్త టెక్నాలజీ 

ఇందిరమ్మ టవర్ల కేటాయింపునకు కొత్త టెక్నాలజీ 
  • లోకేషన్, కరెంట్ బిల్లు ఆధారంగా నియోజకవర్గం గుర్తింపు
  • ఫొటోలు పంపాలని 25 వేల మందికి హౌసింగ్ బోర్డు మెసేజ్‌‌లు
  • ఏ నియోజకవర్గం పేదలకు అక్కడే ఫ్లాట్లు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కేటాయింపును పారదర్శకంగా చేపట్టేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోని పేదలకు అదే నియోజకవర్గంలో ఫ్లాట్లు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. తొలి విడతలో ఇతర నియోజకవర్గాల వారికి ఫ్లాట్లు కేటాయించడంపై ఎమ్మెల్యేలు హౌసింగ్ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లడంతో రెండో విడతలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

ఇతర నియోజకవర్గాల వారికి ఫ్లాట్లు.. 

కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 20 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తున్నారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,300 మందికి ఫ్లాట్లు కేటాయించారు. అయితే, కొందరు ఇతర నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకొని లాటరీలో ఫ్లాట్లు పొందడంతో వివాదం తలెత్తింది. ఖైరతాబాద్, కూకట్‌‌పల్లి నియోజకవర్గాల్లో ఈ సమస్యపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌‌లో 480 ఫ్లాట్లు కేటాయించగా, వారిలో స్థానికులు 180 మంది మాత్రమే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభ్యంతరం తెలిపారు.

లోకేషన్, కరెంట్ బిల్లుతో గుర్తింపు.. 

రెండో విడతలో దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి లొకేషన్, కరెంట్ బిల్లు ఫొటోలు పంపాలని హౌసింగ్ బోర్డు అధికారులు 25 వేల మందికి మెసేజ్‌‌లు పంపారు. లొకేషన్ ఆధారంగా వారు నివసిస్తున్న ఇల్లు, నియోజకవర్గాన్ని గుర్తించేందుకు జియో ట్యాగింగ్, జీపీఎస్ మ్యాపింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ వివరాలను దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ టవర్ నియోజకవర్గంతో సరిపోల్చి, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అర్హులైన పేదలకు వారి నియోజకవర్గంలోనే ఫ్లాట్లు కేటాయించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.