హైదరాబాద్: తెలంగాణలో 365 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఎల్ నినో ప్రభావంతో ఈ కరువు మండలాల్లో దుర్భర పరిస్థితులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు పశుగ్రాసం, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రాన్ని కరువు వేగంగా కమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఎల్నినో ప్రభావంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మరోవైపు చలికాలంలోనూ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయి. భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. దీంతో రాబోయే మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కరువు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
రాష్ట్రంలో మొత్తం 621 మండలాలుండగా.. నెల రోజుల కిందట 235 మండలాల్లో కనిపించిన కరువు ఛాయలు, సెప్టెంబర్ చివరి నాటికి 315 మండలాలకు విస్తరించాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 365కు చేరినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి మరింత దిగజారకముందే ప్రతి మండలానికీ సమగ్ర యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని ప్రభుత్వానికి విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే సూచించింది.
