Anirudh-Kavya Maran Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ ఇన్విటేషన్ చూశారా? రాయల్ లుక్ అదిరిందిగా!

Anirudh-Kavya Maran Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ ఇన్విటేషన్ చూశారా? రాయల్ లుక్ అదిరిందిగా!

సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో ఓనర్ కావ్య మారన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ జంట వివాహ వేడుకలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, లేటెస్ట్ గా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందమైన డిజైన్, సంప్రదాయపు హంగులు, రాజసాన్ని ప్రతిబింబించే అలంకరణతో ఈ ఆహ్వాన పత్రిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

రాయల్ లుక్ లో ఇన్విటేషన్‌ కార్డు..

ఈ రిసెప్షన్ ఇన్విటేషన్‌ను చూస్తేనే వేడుక ఎంత గ్రాండ్‌గా ఉండబోతోందో అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐవరీ, లేత నీలం రంగుల కలయికతో రూపొందించిన ఈ ఆహ్వాన పత్రికకు బంగారు రంగు అలంకరణలు, సున్నితమైన డెకరేటివ్ ప్యాటర్న్స్, వింటేజ్ స్టైల్ సీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంజని అయ్యంగార్, పింక్ విసిల్ మ్యాన్ రూపొందించిన ఈ డిజైన్ సంప్రదాయ సౌందర్యానికి ఆధునిక హంగులను జోడించింది.

నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్..

ఈ జంట రిసెప్షన్ నవంబర్ 21, 2026న చెన్నైలో జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు తదితరులకు ఆహ్వానాలు అందించారు.

►ALSO READ | King 100 OTT Deal: నాగార్జున 100వ సినిమాకు భారీ ఓటీటీ డీల్? డిసెంబర్ 24న 'కింగ్ 100' రిలీజ్!

గ్రీస్‌లో పెళ్లి.. 

అనిరుధ్ తల్లిదండ్రులతో కలిసి సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ ప్రముఖ రాజకీయ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వానించారు. వీరికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, నవంబర్‌లో గ్రీస్‌లో ఈ జంట వివాహం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

ఒకవైపు అనిరుధ్ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తుండగా, మరోవైపు ఐపీఎల్‌లో కావ్య మారన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వీరి వివాహ వేడుక ఎలా ఉండబోతోంది? సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఎవరెవరు హాజరవుతారు? అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది..