కేటీఆర్ పాస్‌పోర్ట్ విషయంలో వైఖరేంటో చెప్పండి.. ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

కేటీఆర్ పాస్‌పోర్ట్ విషయంలో వైఖరేంటో చెప్పండి.. ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ పాస్‌పోర్ట్ విషయంలో వైఖరేంటో చెప్పాలని ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి కేటీఆర్కు నోటీస్ అందింది.

ACB లేఖతో పాస్ పోర్ట్ impoundపై RPO అధికారులు నోటీస్ ఇచ్చారు. రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ జారీ చేసిన నోటీసుపై హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. స్టేటస్ కో ఇస్తూ కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతివాదులు అందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 6 వాయిదా వేసింది. 

కేటీఆర్ పాస్ పోర్టును ఎందుకు జప్తు చేయకూడదో వివరించాలని కోరుతూ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీస్ సెప్టెంబర్ 28న కేటీఆర్కు షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసును సవాల్ చేస్తూ కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

పాస్ పోర్ట్ అథారిటీ చర్యలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని, ఏకపక్షంగా.. పక్షపాత థోరణిలో ఉన్నాయని.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ను చేర్చారు.