King 100 OTT Deal: నాగార్జున 100వ సినిమాకు భారీ ఓటీటీ డీల్? డిసెంబర్ 24న 'కింగ్ 100' రిలీజ్!

King 100 OTT Deal: నాగార్జున 100వ సినిమాకు భారీ ఓటీటీ డీల్? డిసెంబర్ 24న 'కింగ్ 100' రిలీజ్!

అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్ 100'. తన 100వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని నాగార్జున భావిస్తున్నారు. ఆర్. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

భారీ ధరకు డిజిటల్ హక్కులు?

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. 'కింగ్ 100' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ (SonyLIV) అన్ని భాషల కోసం భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్రమోషన్లపై దృష్టి పెట్టేందుకు రెడీ అవుతోంది.. అటు నాగార్జున 100వ సినిమా కావడంతో 'కింగ్ 100'పై ట్రేడ్ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

నాగార్జున వర్సెస్ టబు.. 

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నాగార్జున, టబు కలయిక. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో 'నిన్నే పెళ్లాడతా'తో అలరించిన వీరిద్దరూ, ఈసారి యాక్షన్ డ్రామాలో ఎదురెదురుగా నిలవనున్నారనే ప్రచారం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. టబు శక్తిమంతమైన ప్రతినాయిక పాత్రలో కనిపించనుందనే అంచనాలు కూడా ఉన్నాయి. దసరాకు విడుదల కావాల్సిన ఆమె గ్లింప్స్ వాయిదా పడటంతో, తదుపరి అప్‌డేట్‌పై ఉత్కంఠ నెలకొంది.

►ALSO READ | Nani - Nithiin Movie: మెలోడీ మాయలో పడేస్తున్న 'రుకు రుకు రుక్మిణి'.. నితిన్ ఖాతాలో హిట్ పడ్డట్లేనా?

డిసెంబర్ 24న విడుదల..

భారీ ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ ఉద్రిక్తతలు, హై-వోల్టేజ్ యాక్షన్‌తో సాగనున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్, అశోక్ సెల్వన్, విజయేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఒక సామాన్యుడు రూ.50,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి 'కింగ్'గా ఎదిగే ప్రయాణమే కథలో కీలక ఆకర్షణగా నిలవనుంది. 2026 డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమా నాగార్జునకు కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందా? టబుతో పోరు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.