- రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోం
- పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
- అధికారుల పనితీరులో మార్పు రాకపోతే చర్యలు
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మెదక్/సంగారెడ్డి, వెలుగు: భూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యాన్ని సహించేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతగా పనిచేసినప్పుడే రైతుల సమస్యలు తీరుతాయని, అధికారుల్లో మార్పురాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖల పనితీరుపై సంగారెడ్డి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉపాధి, కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి వివేక్ వెంకటస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై భూ సర్వే నిర్వహణపై తహసీల్దార్లు, సర్వేయర్లతో ముఖాముఖి నిర్వహించారు. సర్వే కోసం ఎన్ని గ్రామాలను కేటాయించారు, ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో సర్వే పూర్తయింది, ఏ విధంగా సర్వే చేస్తున్నారు, రోజుకు ఎన్ని ఎకరాల భూమిని సర్వే చేస్తున్నారు, ఎంత సమయం పడుతుంది.. తదితర అంశాలపై ఆరా తీశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కరించి రికార్డుల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని మంత్రి తెలిపారు. సర్వే సమయంలో సంబంధిత రైతుకు అతడి భూమి విస్తీర్ణం ఎంతఅన్నది స్పష్టంగా తెలియజేయాలని తహసీల్దార్లు, సర్వేయర్లకు సూచించారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు.
వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి అందించేవరకు విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కొనసాగుతుందని చెప్పారు. ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణ భారాన్ని తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్ రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న భూములు, ఇండ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కలెక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి , సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కలెక్టర్లు ప్రతీక్ జైన్, ప్రతిమాసింగ్, హైమావతి పాల్గొన్నారు.
