ఒడిశాలో సింగరేణి ఆఫీస్, కాలనీకి స్థలం కేటాయించాలి ..అంగూల్ కలెక్టర్‌‌‌‌కు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి విజ్ఞప్తి

ఒడిశాలో సింగరేణి ఆఫీస్, కాలనీకి స్థలం కేటాయించాలి ..అంగూల్ కలెక్టర్‌‌‌‌కు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు గని సమీపంలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్‌‌‌‌ను ఆ సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్​ జ్యోతి కోరారు. నైనీ గని సమీపంలో థర్మల్ విద్యుత్ కేంద్రం, నిర్వాసితుల కోసం ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీ, బొగ్గు రవాణా రోడ్ల నిర్మాణానికి స్థలాల కేటాయింపుపై కలెక్టర్‌‌‌‌తో భేటీ అయ్యారు. సహకారం అందించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నైనీ గని నిర్వాసితులైన 40 కుటుంబాలకు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎండీ కోరారు. త్వరలో రిహాబిలిటేషన్ అండ్ పెరిఫెరి అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ అమలు, భూసేకరణ, పునరావాస సమస్యలపై నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 నైనీ గనికి అనుబంధంగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు తుకుడా, జరపడా గ్రామాల్లోని భూమిని గుర్తించామని, స్థల సేకరణకు సహకరించాలని సీఎండీ కోరారు. ప్రస్తుతం నైనీ బ్లాక్‌‌‌‌ నుంచి బొగ్గును జరపడా రైల్వే జంక్షన్‌‌‌‌కు తరలించేందుకు చండీపడా-జరపడా గ్రామాల మధ్య బైపాస్‌‌‌‌ రోడ్డు నిర్మాణానికి సింగరేణి ఇప్పటికే రూ. 35 కోట్లు డిపాజిట్‌‌‌‌ చేసింది. ఈ రోడ్డు ఇతర బొగ్గు పరిశ్రమలకూ ఉపయోగపడనున్నందున సంబంధిత శాఖల సహకారంతో నిర్మాణం పూర్తి చేయాలని సీఎండీ కోరారు. ఒడిశాలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎండీ కోరారు.  

ప్రపంచంలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ సందర్శన.. 

అంగూల్ జిల్లాలో జిందాల్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌‌‌‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్​ జ్యోతి, డైరెక్టర్లు, ఇతర అధికారులు సందర్శించారు. దేశీయ బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసి జిందాల్ స్టీల్‌‌‌‌లో వినియోగిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సీఎండీతో పాటు సింగరేణి డైరెక్టర్లు గౌతమ్ పోట్రు, ఎల్.వి. సూర్యనారాయణ, ఈడీ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, నైనీ గని జనరల్ మేనేజర్ బైద్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.