వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ‘ దాదాపు 25 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ చేశా. ఆయన అన్ని ఎలిమెంట్స్‌తో ఈ స్ర్కిప్ట్ రాశారు. ఇప్పటికే చాలా ఫ్యామిలీ సినిమాలు చేశాను. అయినా ఇది నాకు వెరీ స్పెషల్.
ఏం జరిగినా ఫ్యామిలీని కాపాడుకునే క్యారెక్టర్ నాది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడుకోవడానికి నలుగురు మనుషులు ఎంత కష్టపడ్డారు, ఎంత దూరం వెళ్లారు అనేది ఈ చిత్ర కథ. ఫ్యామిలీ కోసం ఓ సామాన్యుడు తెగిస్తే ఎంతదూరమైన వెళ్లగలడు అనేది ఇందులో చూస్తారు. కుటుంబ విలువలను చెప్పే చిత్రమిది. ఇక ‘పవిత్రబంధం’ చిత్రంతో రచయితగా నా సినీ ప్రయాణం మొదలైంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ టైమ్‌లో వెంకటేష్ గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. అప్పటినుంచీ నా కెరీర్ వేరే టర్న్ తీసుకుంది. అందుకే ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ఈ సినిమాకు పనిచేసిన ప్రతి యాక్టర్, టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. టీమ్ అందరి ఎఫర్ట్‌తో అవుట్‌పుట్ బాగా వచ్చింది’ అని చెప్పారు. శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ ‘వెంకటేష్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా’ అని చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగమవడం సంతోషంగా ఉందని మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ‘వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబోలో వర్క్ చేయడం డ్రీమ్ కమ్ ట్రూలా ఫీలవుతున్నా. ఇది పాటల సినిమా కాదు.. మాటల సినిమా. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని మ్యూజిక్ చేసేటప్పుడే అర్ధమైపోయింది’ అని చెప్పాడు. నటులు బ్రహ్మాజీ, సత్య, రజిత, బాల నటుడు రాజ్ ప్రజ్వల్, యువినా, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, నిర్మాత చినబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.
