బోయినిపల్లి, వెలుగు : సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలికి, మార్కెట్డిమాండ్కు అనుగుణంగా కూరగాయల సాగు చేపడుతూ ఆదాయం పొందుతున్న ఆదర్శ రైతు మిట్టపల్లి కమలాకర్‌రెడ్డిని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అభినందించారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన కమలాకర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. పంటల సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. రైతు తన నాలుగు ఎకరాల్లో బూడిద గుమ్మడి, కూర (రాస) గుమ్మడి, మిర్చి, బీరకాయ సాగు చేస్తున్నారు.
మల్చింగ్, డ్రిప్ విధానాలను అనుసరిస్తూ నీటిని పొదుపుగా వినియోగిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ బూడిద గుమ్మడి ద్వారా రూ.80 వేలు, మిర్చితో రూ.2 లక్షలు, బీరకాయతో రూ.లక్ష, 20 గుంటల్లో సాగు చేసిన కూర గుమ్మడితో రూ.30 వేల ఆదాయం పొందినట్లు తెలిపారు. వేములవాడ, కరీంనగర్ మార్కెట్లలో కూరగాయలను విక్రయిస్తున్నట్లు వివరించారు. దీంతో ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయంగా మార్కెట్ డిమాండ్‌ఉన్న పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్ అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ ఆఫీసర్ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
