పెద్దపల్లి /ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం చామనపల్లి గ్రామస్తుల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామపంచాయతీ ఆఫీస్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ అమలు చేస్తామన్నారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు నీటిని ఎత్తిపోసే సమయంలో ఏండ్ల నుంచి చామనపల్లి ప్రజలు ముంపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 7 రోజుల్లో సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి చేసేందుకు 8 ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇల్లు, చెట్లు, బావులు, ఇతర ఆస్తుల వివరాలతో అంచనాలు రూపొందిస్తామన్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆర్డీవో బి. గంగయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
