స్పెషల్ ట్రైన్లకు రైల్వే శాఖ నో.. రైళ్లలో 10 వేల మందిని తరలించాలనుకున్న రాష్ట్ర కాంగ్రెస్

స్పెషల్ ట్రైన్లకు రైల్వే శాఖ నో.. రైళ్లలో 10 వేల మందిని తరలించాలనుకున్న రాష్ట్ర కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​‘చలో ఢిల్లీ’కి రైల్వే శాఖ మోకాలడ్డింది. ‘సర్’​ప్రక్రియ తీరుకు నిరసనగా సీఈసీ జ్ఞానేశ్​కుమార్​ రాజీనామా డిమాండ్​ చేస్తూ నవంబర్ 1 న ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ, బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభకు తెలంగాణ నుంచి 15 వేల మంది కాంగ్రెస్​ కేడర్‌‌ను తరలించాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ కొద్దిరోజులుగా ఏర్పాట్లు చేస్తున్నది.

ఇందులో భాగంగా హైదరాబాద్​ నుంచి ఢిల్లీకి జనాన్ని తరలించేందుకు పీసీసీ ఇప్పటికే రెండు స్పెషల్​ ట్రైన్లను బుక్​చేసింది. కానీ తీరా మంగళవారం​ ట్రైన్లు కేటాయించలేమంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పడంతో  పీసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది.

రైల్వే శాఖ నిర్ణయంతో గందరగోళం
 సీఈసీ జ్ఞానేశ్​కుమార్​రాజీనామాకు డిమాండ్​చేస్తూ నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ  తెలంగాణ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని పీసీసీకి సూచించింది. ఇందుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండేను రాష్ట్రానికి పరిశీలకునిగా నియమించింది.

ఈ క్రమంలోనే ఈ నెల 23న ప్రజా భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి.. మంత్రులకు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు జనసమీకరణపై  దిశా నిర్దేశం చేశారు. 

మొత్తం మీద 15 వేల మందిని తరలించాలనే ఉద్దేశంతో రెండు ప్రత్యేక రైళ్లను బుక్​చేశారు. వేలాదిగా తరలివెళ్లే పార్టీ కేడర్‌‌​రవాణా, భోజన, వసతి ఏర్పాట్లను చూసేందుకు  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం ఐదుగురితో ప్రత్యేక కమిటీ వేశారు.

ఇందులో ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముగ్గురు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌‌రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. అంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న తరుణంలో  స్పెషల్​ ట్రైన్లు కేటాయించలేమంటూ దక్షిణమధ్య రైల్వే అధికారులు మంగళవారం సమాచారం ఇచ్చారు.