రాజీవ్ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పై ‘ఎక్స్’లో సోనియా

రాజీవ్ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పై ‘ఎక్స్’లో సోనియా
  • నా గురించి అసత్యాలు, అతిశయోక్తులకు జవాబు ఇస్తా
  • పుస్తకం బయటికి వచ్చాక ఎంతో కొంత దుమారం తప్పదు
  • ఇటలీ బాల్యం నుంచి 2004 దాకా వివరించినట్టు వెల్లడి

న్యూఢిల్లీ: తన జీవితం గురించి ఇన్నేళ్లుగా ప్రచారంలో ఉన్న అసత్యాలు, అతిశయోక్తులను సరిదిద్దేందుకే ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌‌‌‌పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో రాసిన ఈ పుస్తకం తన పట్ల ప్రజల అభిప్రాయాన్ని మారుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

దశాబ్దాలుగా ఇతరులు తన కథ చెబుతూ వచ్చారని, ఇప్పుడు తన వంతు వచ్చిందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ పుస్తకం బయటకు వచ్చాక కొంత ‘తమాషా’ జరగడం ఖాయమని చిరునవ్వుతో అన్నారు.

ఇప్పుడు నా వంతు
మంగళవారం ఎక్స్‌‌‌‌లో 1.28 నిమిషాల వీడియోను సోనియా గాంధీ పోస్ట్ చేశారు. ‘ఈ పుస్తకం వచ్చాక కొంత దుమారం తప్పదు. ఇన్నేళ్లుగా ఇతరులు నా కథ చెప్పారు, ఇప్పుడు నా వంతు’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. తన భర్త రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని గుర్తుచేసుకున్నారు. ‘నా గురించి చాలా రాశారు. అందులో చాలా వరకు సరైనది కాదు. కొన్ని కల్పించినవి, కొన్ని అతిశయోక్తులు. 

అందుకే నా కథను నేనే రాసి, జరిగినవి జరిగినట్టుగా చెప్పాలనిపించింది. దీన్ని నా వెర్షన్ అనను, నా కథ అంటాను’ అని సోనియా అన్నారు. ‘ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొందరు నా గురించి అభిప్రాయం మార్చుకోవచ్చు. కొందరి అభిప్రాయం ఇంకా దిగజారవచ్చు. పుస్తకం రాసినప్పుడు, ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఇవి సహజం. దుమారం రేగక తప్పదు’ అని అన్నారు.

ఇటలీ టు ఇండియా 
ఇటలీలో గడిచిన బాల్యం నుంచి, 1965లో కేంబ్రిడ్జిలో రాజీవ్ గాంధీని కలుసుకోవడం, ఆ ప్రేమ తనను భారత్‌‌‌‌కు తీసుకురావడం వరకు సోనియా ప్రయాణాన్ని ఈ ఆత్మకథ వివరిస్తుంది. రాజీవ్‌‌‌‌తో వివాహం, ఇందిరా గాంధీని తొలిసారి కలవడం, హిందీ నేర్చుకోవడం, భారతీయ సంస్కృతికి అలవాటుపడేందుకు చేసిన ప్రయత్నాలను ఇందులో పొందుపరిచారు.

సంజయ్ మరణం, 1984లో ఇందిర హత్య, 1991లో రాజీవ్ హత్య వంటి గాంధీ కుటుంబాన్ని కుదిపేసిన విషాదాలనూ ఈ పుస్తకం స్పృశిస్తుంది. ప్రధాని పదవిని తిరస్కరించి, పార్టీకి, కూటమికి నేతృత్వం వహించిన నాటి రాజకీయ పరిణామాలనూ వివరించారు.