- బాధితుల ఫిర్యాదుతో అవినీతి ఆఫీసర్లకు ఏసీబీ వల
- కారు నంబర్, రూట్ సహా సమాచారం
- దారిలోనే కాపుకాసి క్యాష్ చెకింగ్
- డబ్బుపై వివరాలు అడిగి ఏసీబీ ఆరా
- ఈ ఏడాది ఇప్పటికే 152 కేసులు
- ఫిర్యాదులకు వాట్సాప్
‘‘హైదరాబాద్ వాటర్ వర్క్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ లంచం డబ్బుతో వెళ్తున్నాడు. ఆఫీసులో వసూలు చేసిన డబ్బు తీసుకుని తన కారులో ట్రావెల్ చేస్తున్నాడు.’’ ఆయన కారు నంబర్‌తో పాటు వెళ్లే రూట్ సహా శనివారం సాయంత్రం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తులు శ్రీనివాస్ వద్ద ఉన్న లంచం డబ్బు గురించి వివరించారు. దీంతో ఏసీబీ అధికారులు రాజ్‌భవన్ రోడ్డులో నిఘా పెట్టారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో రూ.2.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
‘‘మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ ఆఫీసులో భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా అధికారులు వసూళ్లు చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్‌ను మ్యూటేషన్ చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.” ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఓ బాధితుడి నుంచి కాల్ వచ్చింది. దీంతో కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌కుమార్ రెడ్డి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వినయ్‌కుమార్ రెడ్డి, ప్రైవేట్ వ్యక్తి బాలకృష్ణలను ఈ నెల 10 ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, లంచాల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులు నమోదు చేయడం, అక్రమాస్తులను గుర్తించడం, అవినీతి అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపడంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే బాధితులు ఈ నంబర్‌కు సమాచారం ఇస్తున్నారు. టోల్‌ఫ్రీ కాల్స్‌తో పాటు మెయిల్, నేరుగా అందే ఫిర్యాదుల ఆధారంగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్‌క్వార్టర్స్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. లంచం తీసుకునే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పాటు అక్రమాస్తులను సీజ్ చేస్తున్నారు.
ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించి చర్యలు
ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజుకు సుమారు 18 నుంచి 20 కాల్స్ వస్తున్నాయి. మెయిల్, నేరుగా అందే ఫిర్యాదులతో కలిపి నెలకు సగటున 400కు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో చాలామంది బాధితులు సమాచారం ఇస్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏసీబీ అధికారులు చర్యలకు దిగుతున్నారు. లంచం తీసుకునే వారిని పట్టుకునేందుకు ట్రాప్ స్కెచ్ వేసి, సంబంధిత అధికారి కార్యాలయ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు గోప్యంగా ఉంచుతాం
కొన్ని సందర్భాల్లో ఏసీబీ అధికారులే బాధితుడి తరఫున బేరసారాలు జరుపుతూ, ట్రాప్‌లో భాగంగా లంచం ఇచ్చేందుకు అంగీకరిస్తారు. ఫినాఫ్తలీన్ కెమికల్ పౌడర్ పూసిన నోట్లను బాధితుడి ద్వారా ఇప్పించి, లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 26 వరకు ఏసీబీ మొత్తం 152 కేసులు నమోదు చేసింది.
గతేడాది 199 కేసులు నమోదు చేసి, 273 మంది నిందితులను అరెస్టు చేసింది. వాటిలో 157 ట్రాప్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన 15 కేసులు, మరో 26 ఇతర కేసులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచం లేదా ఇతర బహుమతులు డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపింది.
అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు:
- టోల్‌ఫ్రీ నంబర్: 1064
- వాట్సాప్: 94404 46106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్: @TelanganaACB
