- నిర్మల్ జిల్లా కేంద్రంలోని చెరువును పరిశీలించిన కలెక్టర్
నిర్మల్, వెలుగు: జిల్లా కేంద్రమైన నిర్మల్లోని ధర్మసాగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలపై కలెక్టర్ భవేష్ మిశ్రా కొరడా ఝళిపించారు. చెరువు పరిధిలోని సర్వే నంబర్ 2032లో ఓ రియల్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ వెంచర్ కోసం నిర్మించిన ఫెన్సింగ్ గోడను వెంటనే కూల్చివేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో పాటు, వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తోపాటు స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ భవేష్ మిశ్రా ఇరిగేషన్ ఈఈ అనిల్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, అర్బన్ తహసీల్దార్ రాజుతో కలిసి చెరువును పరిశీలించారు. హద్దుల మ్యాపును పరిశీలించి, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెన్సింగ్ గోడను కూల్చివేయడంతో పాటు, వెంచర్ పనులు చేపడుతున్న రియల్టర్కు నోటీసులు జారీ చేయాలని, నిర్మాణానికి వినియోగిస్తున్న యంత్రాలు, సామగ్రి, ఇసుకను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ, ఇరిగేషన్ భూముల ఆక్రమణలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆఫీసర్లకు సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ధర్మసాగర్ చెరువు పరిధిలో నిర్మించిన ఫెన్సింగ్ గోడను కూల్చివేసి, అక్కడి మట్టిని సైతం తొలగించారు.
