- విద్యుత్ అవసరాలు, పవర్ ప్లాంట్ల డిమాండ్ నేపథ్యంలో సవరింపు
- రోజు వారీగా గరిష్ఠంగా 2.20లక్షల టన్నుల టార్గెట్
- లక్ష్యాలు అధిగమించేందుకు ప్రొడక్షన్ డేల నిర్వహణ
కోల్‌బెల్ట్, వెలుగు : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, థర్మల్ పవర్ స్టేషన్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం తన వార్షిక, రోజువారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026– 27 లో 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం కాగా, మొదటి ఏడు నెలల్లో (అక్టోబర్ 26 నాటికి) 30.28 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. విద్యుత్ అవసరాలు, పవర్ ప్లాంట్ల డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యాన్ని 66.11 మిలియన్ టన్నులకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 17 ఓసీపీలు, 22 యూజీ మైన్స్ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు వెనుతిరగడంతో భూగర్భ జలాలపై రైతులు ఆధారపడాల్సి వస్తోంది. ఇందు కోసం విద్యుత్ మోటార్ల వినియోగం రెట్టింపు అయ్యింది. దీంతో విద్యుత్ వాడకం పెరగడంతో బొగ్గు ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోంది.
డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు అందక కొన్ని విద్యుత్ ప్లాంట్‌లో యూనిట్లు మూసివేసినట్టు తెలుస్తోంది. బొగ్గు కొరత రాకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం ఏరియాల వారీగా వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సవరించింది. ఈ ఏడాదికి గాను మొదట నిర్దేశించుకున్న 65 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని, తాజా సమీక్షలో 66.11 మిలియన్ టన్నులకు పెంచారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి అన్ని ఏరియాల ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. పెంచిన ఉత్పత్తి టార్గెట్లను సాధించేందుకు ప్రస్తుతం రోజుకు 1.70లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తిని 1.90 లక్షల టన్నులకు పెంచి, క్రమంగా దాన్ని 2.20లక్షల టన్నులకు పెంచాలని టార్గెట్పెట్టారు. బొగ్గు ఉత్పత్తికి తగ్గట్టు ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజువారీ ఓబీ (మట్టి) తొలగింపు లక్ష్యాన్ని 7.28 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి ఏకంగా 12.1లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచారు.
ఏరియాల వారీగా టార్గెట్ల పెంపు..
కొత్తగూడెం ఏరియాలో 2.25మిలియన్ టన్నులుగా ఉన్న టార్గెట్‌ను 3మిలియన్ టన్నులకు, సత్తుపల్లిలో 13.40మిలియన్ టన్నులకు గాను 14.80 మిలియన్ టన్నులకు, ఇల్లెందు ఏరియాలో 3.60 నుంచి 3 మిలియన్ టన్నులకు, మణుగూరులో 9.62 నుంచి 12.21 మిలియన్ టన్నులు, బెల్లంపల్లి ఏరియాలో 3.50 నుంచి 3.75 మిలియన్ టన్నులకు, మందమర్రిలో 2.48 నుంచి 2.50 మిలియన్ టన్నులకు, శ్రీరాంపూర్ ఏరియాలో 6.43 నుంచి 5.20 మిలియన్ టన్నులకు, రామగుండం-1 ఏరియాలో 4.14 నుంచి 4.01 మిలియన్ టన్నులకు, రామగుండం-2 ఏరియాలో 9.87 నుంచి 9.94 మిలియన్ టన్నులకు, రామగుండం-3 ఏరియాలో 3.90 నుంచి 3.90 మిలియన్ టన్నులు, భూపాలపల్లి ఏరియాలో 4.60 నుంచి 3.60 మిలియన్ టన్నులకు, అడ్రియాల ప్రాజెక్టులో 12లక్షల టన్నులకు గాను 15లక్షల టన్నులకు పెంచారు.
ఈ టార్గెట్లను రీచ్ కావడానికి కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, బెల్లంపల్లి, రామగుండం-2, భూపాలపల్లి ఏరియాలపై సంస్థ యాజమాన్యం ఆధారపడనుంది. టార్గెట్లను రీచ్ కావడానికి వచ్చే ఐదు నెలల్లో ప్రొడక్షన్ డేల పేరుతో అధిక ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించనుంది. ఈనెల 21న ప్రొడక్షన్ డే స్పెషల్ డ్రైవ్నిర్వహించి ఒక రోజులో 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. రానున్న రోజుల్లో ఇదే విధంగా ప్రొడక్షన్ డేలను నిర్వహించాలని యాజమాన్యం భావిస్తోంది.
