హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టిపై హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడుతుండని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్ అయ్యారు. మంగళవారం సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందేమోనన్న భయంతో హరీశ్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుండన్నారు. నీటి లభ్యత లేదని తుమ్మిడిహెట్టిని కాదని కాళేశ్వరం కట్టామని తప్పుడు మాటలు మాట్లాడుతుండని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసిందెవరు? దాన్ని నిర్మించింది ఎందుకు? అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవడంతోనే కాళేశ్వరం లోపాలు బయటపడ్డాయని, ఇలాంటి ప్రాజెక్టును చైనాలో కట్టి ఉంటే శిక్ష దారుణంగా ఉండేదని పీసీ ఘోష్ కమిషన్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టింది రైతుల కోసం కాదని, కల్వకుంట్ల కుటుంబ దోపిడీ కోసమని ఆరోపించారు.
