ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అర్నాబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈదురుగాలులకు చెట్లు, గోడలు కూలిన ఘటనలు వెలుగుచూశాయి.
తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్నాబ్ తుపాను వల్ల విశాఖపట్నంలో తీవ్రమైన ఈదురు గాలులు వీచాయి. సిరిపురం పెట్రోల్ బంక్ జంక్షన్ దగ్గర పెద్ద చెట్టు నేలకూలింది. దీంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గాజువాకలోని ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. తుపాను కారణంగా.. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రాజమండ్రి, రాజానగరం, కడియం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గోదావరి నదీ తీరంలో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలను అధికారులు రాజమండ్రిలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలు సమీపంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరం వెంబడి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప వద్ద సముద్ర ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అంబాజీపేట, రావులపాలెం మండలాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక ఈ అర్నబ్ తుపాను తీరం దాటే సమయం (Landfall) విషయానికొస్తే.. ఈరోజు (అక్టోబర్ 28) మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల మీదుగా అర్నాబ్ తుపాను తీరాన్ని తాకవచ్చు.
తుపాను తీరానికి చాలా దగ్గరగా ఉన్నందున వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉంది. అందువల్ల.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీ వ్యాప్తంగా 100కు పైగా రైళ్లు రద్దు కావడం గమనార్హం.
