పని చేసిన ఇంటికే కన్నం..మారేడ్‌పల్లిలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

పని చేసిన ఇంటికే కన్నం..మారేడ్‌పల్లిలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
  • రూ. 15 లక్షల నగదు, కిలోకు పైగా బంగారం రికవరీ

పద్మారావునగర్​,వెలుగు : సికింద్రాబాద్‌ వెస్ట్ మారేడ్‌పల్లి పరిధిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గతంలో ఆదే ఇంట్లో పనిచేసిన కార్పెంటరే ఇంటి తాళాలు పగలగొట్టి కిలోకు పైగా బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు నిందితుడిని మారేడ్‌పల్లి క్రైమ్ టీమ్​అరెస్ట్ చేసింది. దాదాపు 1.180 కిలోల బంగారు నగలతో పాటు రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. వివరాలను డీసీపీ  శ్రీధర్​ వెల్లడించారు. 

నెహ్రూనగర్‌లోని వెంకట సాయి రెసిడెన్సీలో ఉంటున్న డాక్టర్ శ్రీ ఆచి మోహన్ తన కుటుంబంతో కలిసి 19న ఖమ్మం జిల్లా ఇల్లందు వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూడగా, బెడ్‌రూమ్ తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని 1.180 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు, వేలిముద్రలు సేకరించడంతో పాటు సీసీటీవీ విజువల్స్​పరిశీలించారు. 

విచారణలో బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన కార్పెంటర్ వెల్శాల భరత్ (38) దొంగతనం చేశాడని తేలింది. గతంలో బాధితుడి ఇంట్లో వడ్రంగి పనులు చేసిన భరత్‌కు ఆ ఇల్లు, విలువైన వస్తువులు ఎక్కడ ఉంచుతారనే విషయాలపై పూర్తి అవగాహన ఉండడంతో బాధితులు ఊరెళ్లిన టైం చూసి దొంగతనం చేశాడని పోలీసులు చెప్పారు.