- విద్యార్థులు, మైనర్లకు విక్రయం
- ఇద్దరు అరెస్ట్..39 ఈ- సిగరెట్లు సీజ్
హైదరాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర ఎలక్ట్రానిక్ సిగరెట్ (ఈ–సిగరెట్) నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ నజర్ పెట్టింది. కేరళ, కర్నాటక నుంచి హైదరాబాద్ సప్లయ్ అవుతున్న ఈ సిగరెట్ ముఠా గుట్టురట్టు చేసింది. రూ.10 కోట్లకు పైగా లావాదేవీలను గుర్తించింది. విద్యార్థులు, మైనర్లు, యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత వేప్స్‌ను విక్రయిస్తున్నారని ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఈగల్ ఫోర్స్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్ సైనిక్‌పురిలో ‘ది స్మోక్ షాప్’ దుకాణంపై కుషాయిగూడ పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు.
తనిఖీల్లో మొత్తం39 ఈ-సిగరెట్లు, ఒక పేమెంట్ స్కానర్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షాప్ యజమాని ఉబైస్ (20), అక్కడ పనిచేస్తున్న ఉస్సైనార్ పీహెచ్ (19)ను అరెస్టు చేశారు. వీరిద్దరూ కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు. సైనిక్‌పురిలో నివసిస్తున్న ఉబైస్.. జూలై 2026లో నెలకు రూ.50 వేల అద్దెతో దుకాణాన్ని తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
వాట్సాప్‌లో ఆర్డర్లు
ఉబైస్ హైదరాబాద్‌లో వ్యాపారం ప్రారంభించేందుకు బెంగళూరులోని ‘స్మోక్ వ్యూ’ దుకాణంలో అర్షద్ నుంచి రూ.50 వేల విలువైన ఈ-సిగరెట్లు కొనుగోలు చేశాడు.వివిధ బ్రాండ్ల ఈ -సిగరెట్లు అందుబాటులో ఉన్నాయంటూ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా సమాచారం పంపేవాడు. ఫోన్‌పే ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు కేరళలోని కాసరగోడ్‌లో ఉన్న కెనరా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన స్కానర్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆగస్టు 3 నుంచి ఇప్పటివరకు 26 డెలివరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలస్తున్నారు. హైదరాబాద్‌లో సుమారు 45 మంది వినియోగదారులను గుర్తించారు. డిజిటల్ చెల్లింపుల వివరాలు, డెలివరీ రికార్డుల ఆధారంగా మరింతమంది గుర్తించే అవకాశం ఉంది.
