వెలుగు స్పెషల్: ఏఐతో ఉద్యోగాల కోత చైనా  ఏం చేస్తోంది? 

వెలుగు స్పెషల్: ఏఐతో ఉద్యోగాల కోత చైనా  ఏం చేస్తోంది? 

ఒక సంస్థ కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో గతంలో వందల మంది చేసే పనిని అతి తక్కువ మంది సిబ్బంది చేయగలిగితే  సాధారణంగా దాన్ని సాంకేతిక విజయంగా పరిగణిస్తాం. దీనివల్ల సంస్థ ఖర్చులు తగ్గి ఉత్పాదకత పెరగడమే కాకుండా లాభంతోపాటు వాటాదారుల విశ్వాసం కూడా పెరగవచ్చు. కానీ ఉద్యోగాలు కోల్పోయినవారి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇదే పరిణామం సమాజంలో విస్తృతంగా కొనసాగితే, ఆయా సంస్థల ఉత్పత్తులకు గిరాకీ ఎక్కడి నుంచి వస్తుంది?  సాంకేతిక పురోగతిపై జరుగుతున్న చర్చల్లో తరచూ మరుగునపడుతున్న ప్రధాన అంశం ఇది.  

కృత్రిమ మేధస్సు వల్ల ఉపాధిపై పడే ప్రభావంపై  ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ, చైనా ఈ అంశాన్ని  ప్రత్యేక  ప్రభుత్వ విధానంలో భాగంగా  ముందుకు తెచ్చింది. అక్టోబర్ 23న ఆ దేశ స్టేట్ కౌన్సిల్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాలు, సాంకేతిక అభివృద్ధిని  ప్రోత్సహిస్తూనే ఉపాధి అవకాశాలను పెంచడం, ఉద్యోగాలపై  ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆరు విభాగాల్లో 18 చర్యలను ప్రతిపాదించాయి.  ప్రపంచంలో ప్రముఖ సాంకేతిక శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న చైనా, అదే సాంకేతికత వల్ల ఉపాధిపై ఏర్పడే ఒత్తిడిని ప్రభుత్వ విధానాల ద్వారా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తించడం ఈ పరిణామంలో ప్రత్యేకంగా పరిశీలించాలి. 

యంత్రాలు మానవ శ్రమను తగ్గించడం పారిశ్రామిక చరిత్రలో కొత్త పరిణామం కాదు.  గతంలో  వ్యవసాయం, తయారీ రంగాల్లో యాంత్రీకరణ  ఉత్పాదకతను పెంచగా, సేవారంగంలో కంప్యూటరీకరణ  దస్త్రాల నిర్వహణ, సమాచార మార్పిడితోపాటు అనేక కార్యాలయ పనుల  స్వరూపాన్ని, వేగాన్ని మార్చింది. ఈ మార్పులు కొన్ని పాత పనుల అవసరాన్ని తగ్గించినప్పటికీ,  కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకూ దారితీశాయి. అయితే అదే ధోరణి కృత్రిమ మేధస్సు విషయంలోనూ తప్పనిసరిగా పునరావృతమవుతుందని చెప్పలేం. 

ఎందుకంటే, ఇప్పుడు ఏఐ   కొన్ని సృజనాత్మక,  విశ్లేషణాత్మక పనుల్లోనూ మానవ సామర్థ్యాలకు దీటుగా, కొన్ని సందర్భాల్లో మరింత మెరుగ్గా  పనిచేస్తోంది.  అనేక విధులను తక్కువమంది సిబ్బందితో నిర్వహించే అవకాశం కల్పిస్తోంది. అయితే  ఏఐ కొత్త ఉద్యోగావకాశాలను  కూడా  సృష్టిస్తోంది  అనే విషయంలోనూ స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది. అయితే,  ఉన్న ఉద్యోగాలు తగ్గేంత  వేగంతోనే  కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయా?  కొత్త నైపుణ్యాలు కలవారు కొత్త అవకాశాలు అందిపుచ్చుకంటే  పాతవారి భవిష్యత్తేంటి?  అన్నవే  కీలకమైన ప్రశ్నలు.

ఏఐ ప్రభావిత ఉద్యోగులకు సహాయం

చైనా  ప్రకటించిన మార్గదర్శకాలు ఏఐ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం,  కొత్త వృత్తులను  ప్రోత్సహించడంపై దృష్టి సారించాయి.  ఏఐ వల్ల తక్కువ  ప్రభావితమయ్యే చిన్న సంస్థల ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు,  గణనీయమైన ఉద్యోగ నష్టం సంభవించే అవకాశమున్న ఏఐ ప్రాజెక్టుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయడంపై దృష్టి పెడుతున్నాయి.  శ్రమ సాంద్రత ఎక్కువగా ఉన్న రంగాల్లో ఏఐ వినియోగాన్ని ఆచితూచి ప్రవేశ పెట్టాలని,  పెద్ద ఎత్తున సాంకేతికతను ప్రవేశ పెట్టే సందర్భాల్లో ప్రభావిత ఉద్యోగులకు ముందస్తు సమాచారం, ఇతర పనులకు మారేందుకు అవసరమైన సహాయం అందించాలని సూచిస్తున్నాయి. 

ఉద్యోగ మార్పునకు సంధికాలం కల్పించే విధానాలను సంస్థలు పరిశీలించాలని  కూడా చెబుతున్నాయి.  అంటే, ఉపాధి కోల్పోయిన తర్వాత సహాయం అందించడానికే పరిమితం కాకుండా, సాంకేతిక మార్పు వల్ల ఉపాధిపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి దానికి సన్నద్ధంగా ఉండే ప్రణాళికగా చైనా విధానాన్ని చూడవచ్చు. అయితే, ఎంతమందికి ప్రత్యామ్నాయ ఉపాధి లభిస్తుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది. అయినప్పటికీ ఈ సమస్యను  ప్రభుత్వ విధానంలో భాగంగా ఆ దేశం  గుర్తించడం గమనించదగిన పరిణామం.

భారత్ ఏం చేయాలి?

మన దేశంలో సమాచార సాంకేతిక సేవలు, అంతర్జాతీయ సేవాకేంద్రాలు ప్రత్యక్ష ఉద్యోగాలను గణనీయ సంఖ్యలో సృష్టిస్తున్నాయి. ఆయా ఉద్యోగుల కొనుగోలు శక్తిపై ఆధారపడే రవాణా, ఆతిథ్యం, భవన నిర్మాణం, ఇతర స్థానిక సేవలూ కూడా భారీస్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వేగంగా విస్తరించిన ఐటీ పరిశ్రమ సైబరాబాద్ వంటి మహానగరాన్నే సృష్టించడం దీనికి  ప్రత్యక్ష ఉదాహరణ. అందువల్ల సాంకేతిక రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఆదాయాలు తగ్గితే దాని ప్రభావం సంబంధిత ఉద్యోగులకే పరిమితం కాకుండా అనుబంధ రంగాలకూ విస్తరించే అవకాశం ఉంది. 

అందువల్ల ఏఐ  ప్రభావాన్ని అంచనా వేసేటప్పుడు  ఈ  పరోక్ష పరిణామాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.  ఏ రంగాల్లో సిబ్బంది అవసరం తగ్గే ప్రమాదం ఉంది, ఎక్కడ కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి అనే అంశాలపై విశ్వసనీయమైన  సమాచారాన్ని సేకరించడం మొదటి అడుగు.  పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు చేపట్టే సంస్థలు ప్రభావిత ఉద్యోగులకు సాధ్యమైనచోట ఇతర బాధ్యతలకు మారే అవకాశాలను 
కల్పించేలా విధానపరమైన చర్యలు చేపట్టాలి.

ఏఐ ప్రభావంపై అధ్యయనం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్షణ కర్తవ్యం

ఉద్యోగ మార్పు సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిమితం చేసేందుకు తగిన సహాయం అందించాలి. సాంకేతిక, ఏఐ రంగాల్లో శరవేగంతో ప్రయాణిస్తున్న సింగపూర్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు చేపడుతున్న ముందుజాగ్రత్త చర్యలపై కూడా అధ్యయనం చేయాలి. ఈ విషయంలో నీతి ఆయోగ్, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, సాంకేతిక  పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్,  ప్రముఖ సాంకేతిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. మారుతున్న ఉపాధి  అవసరాలను గుర్తించడం, అమలు చేయదగిన  విధానాలను సూచించడం వంటి అంశాల్లో ఈ సంస్థల సమష్టి కృషి అవసరం.  మానవాళి సర్వతో ముఖాభివృద్ధికి ఆలంబనగా నిలిచే సాంకేతిక పురోగతిని అడ్డుకోకుండా, దాని వల్ల ఉపాధిపై ఏర్పడే సవాళ్లను ముందుగానే గుర్తించి ఎదుర్కోవడమే  భారత్ తక్షణ కర్తవ్యం. 

- కృష్ణ బాలాజి పల్లపోతు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిటైర్డ్) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.