- అధికారుల తనిఖీల్లో గుర్తింపు
కారేపల్లి, వెలుగు: అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన ఘటనలో నలుగురిపై అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ విద్యుత్ వైర్లను గుర్తించిన అధికారులు విచారణ అనంతరం నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా కారేపల్లి లో ఈనెల 24న రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా పదేపదే నిలిచిపోతుండటంతో విద్యుత్ శాఖ సిబ్బంది సహకారంతో అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
అప్పాయిగూడెం పరిసర ప్రాంతంలోని పాలిక కోటయ్యకు చెందిన పామాయిల్ తోటలో వన్యప్రాణులను పట్టుకునేందుకు అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. విచారణ చేపట్టిన అటవీ అధికారులు నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులు మాదారం, పరిసర గ్రామాలకు చెందిన పబ్బుల రాములు, భూక్యా రఘు, రెడ్డిబోయిన వెంకన్న, ఎల్లిబోయిన నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అధికారులు తెలిపారు.
