అంగన్ వాడీలో విషపురుగు కుట్టి చిన్నారి మృతి.. ఖమ్మం జిల్లాలో ఘటన

అంగన్ వాడీలో విషపురుగు కుట్టి చిన్నారి మృతి.. ఖమ్మం జిల్లాలో ఘటన

ఖమ్మం టౌన్, వెలుగు :  అంగన్​వాడీ స్కూల్ లో పురుగు కుట్టి చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖమ్మం నగరంలోని 7వ డివిజన్ టేకులపల్లికి చెందిన అయ్యదేవర రవి, స్వప్న దంపతుల కుమార్తె ధన్యశ్రీ(5)ని ఎప్పటిలాగే సోమవారం అంగన్​వాడీ సెంటర్ కు ఆయమ్మతో పంపారు. సెంటర్ లో చిన్నారి టాయిలెట్స్ వైపు వెళ్లగా గుర్తుతెలియని విషపురుగు కరిచినట్లు ఆయమ్మ గమనించింది. వెంటనే చిన్నారి బాడీపై దురద, దద్దుర్లు రావడంతో ఆమె చిన్నారి పేరెంట్స్​కు సమాచారం ఇచ్చింది. 

పేరెంట్స్​​ చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. చిన్నారి మృతికి అంగన్​వాడీ సెంటర్ ఆయా, టీచర్ బాధ్యులని ఆరోపిస్తూ మృతదేహంతో వైరా వెళ్లే బైపాస్ రోడ్డుపై విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీల నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని, బాలిక తల్లికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇల్లు,  రూ.2 లక్షల నష్ట పరిహారం  ప్రకటించడంతో ధర్నాను విరమించారు.