ప్రస్తుత పంటను కాపాడాలి..యాసంగిలో వరి సాగు చేయొద్దని ప్రచారం చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రస్తుత పంటను కాపాడాలి..యాసంగిలో వరి సాగు చేయొద్దని ప్రచారం చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఎల్​నినో’ పరిస్థితులపై సమీక్ష

ఖమ్మం, వెలుగు:  ఎల్​నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను అన్ని విధాలా కాపాడాలని, రాబోయే యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో ఖమ్మం కలెక్టర్ దివాకర, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్​లతో కలిసి మంత్రి సంబంధిత శాఖల అధికారులతో ఎల్​నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ కరువు పరిస్థితులు, మండలాల వారీగా భూగర్భ జలాలు తగ్గుతున్న తీరుపై ప్రజలకు  అవగాహన కల్పించాలన్నారు. 

రైతులకు అవసరమయ్యే  ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బిందు సేద్యం ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిన్నెరసాని నీటిని యాసంగి పంటలకు విడుదల చేయవద్దని, అవసరమైతే మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు వినియోగించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ పరిధిలోని  రెగ్యులేటర్లు, షట్టర్లు, పంపిణీ వ్యవస్థలను మూసివేసి, పాలేరు వరకు ప్రధాన కాలువల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో మూడు పంప్​హౌస్​లను వినియోగించి ఎక్కువ నీటిని నిల్వ చేయాలని చెప్పారు. పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా నీటి నిల్వలను ఉంచాలన్నారు. 

మిషన్ భగీరథ నీటి సరఫరా సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలని, పైపులైన్ల లో లీకేజీలను అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా గ్రామాల్లో పాత తాగునీటి సరఫరా పథకాలను పునరుద్ధరించాలన్నారు. పత్తి, ధాన్యం కొనుగోళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్, సిండికేట్లు ఏర్పడకుండా మార్కెటింగ్ శాఖ అలర్ట్​గా ఉండాలన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఓటర్ల నమోదును స్పీడప్ చేయాలి
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును స్పీడప్ చేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యావంతుడిగా, రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తిగా సర్వోత్తమ రెడ్డి పట్టభద్రుల సమస్యలను అర్థం చేసుకుని పనిచేయగలరని తెలిపారు. ప్రతి కార్యకర్త, నాయకుడు గడపగడపకూ వెళ్లి అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఇన్​చార్జి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, సాదు రమేశ్​రెడ్డి పాల్గొన్నారు.