ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: కూనంనేని

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: కూనంనేని

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ శ్రేణులు రాజీలేని ఉద్యమాలు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్న చోట పార్టీ శ్రేణులు వారికి అండగా నిలువాలని స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌‌‌‌ హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌‌‌‌లో జమ్ముల జితేందర్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన రెండ్రోజుల పాటు జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. సీపీఐ నేత నారాయణ పాల్గొని జాతీయ రాజకీయ పరిస్థితులపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఆర్టీసీ ఎన్నికల్లో గెలుపొందిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్నను రాష్ట్ర సమితి వేదికపై నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిస్వార్థంగా పోరాటాలు చేస్తే ప్రజలు అక్కున చేర్చుకుంటారని  అన్నారు. 

ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని సీపీఐ నేత పల్లా వెంకట్‌‌‌‌రెడ్డి ఆరోపించారు.