హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో నమోదైన కేసులో పాస్‌పోర్టు జప్తు వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ పాస్‌పోర్టు జప్తుకు సంబంధించి పాస్‌పోర్టు రీజినల్ అధికారి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌తోపాటు అంతకుముందు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నవంబరు 6వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ, పాస్‌పోర్టు రీజినల్ అధికారి, ఏసీబీ డీజీలకు నోటీసులు ఇచ్చింది. పాస్‌పోర్టు జప్తుకు సంబంధించి అక్టోబరు 10న పాస్‌పోర్టు అధికారి జారీ చేసిన ప్రొసీడింగ్స్, సెప్టెంబరు 28 జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు మంగళవారం విచారించింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్టు కార్యాలయం చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధమన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఎలాంటి అరెస్ట్‌లు లేవని, ఇప్పటికే చార్జ్‌షీటు కూడా నమోదు చేశారన్నారు. కేసు విచారణకు పిటిషనర్ హాజరవుతున్నారని అయితే ఈ మధ్యలో ఏసీబీ లేఖ ఆధారంగా పాస్‌పోర్టు జప్తుకు సెప్టెంబరు 28న షోకాజ్ నోటీసు జారీ చేసిందన్నారు. నోటీసుకు సమాధానం అక్టోబరు 10న సమాధానం ఇచ్చారని, 12న పాస్‌పోర్టు కార్యాలయానికి అందిందన్నారు.
అయితే అక్టోబరు 13న పాస్‌పోర్టు జప్తు వ్యవహారంలో ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం చెల్లదన్నారు. ఇది పిటిషనర్ ప్రాథమిక హక్కులకు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ పాస్‌పోర్టు అధికారుల ఎదట వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు వినిపించేందుకు పిటిషనర్‌కు అవకాశం కల్పించామన్నారు.
పాస్‌పోర్టు చట్టంలో అలాంటి అవకాశం ఇవ్వాలన్న నిబంధన లేకపోయినాప్పటికీ పిటిషనర్ అభ్యర్థనతో వ్యకిగత వివరణ ఇచ్చేందుకు అనుమతించామని, అందువల్ల సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్న వాదన సరికాదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ చార్జ్‌షీటు దాఖలు చేసిన తరువాత కోర్టు అనుమతి లేకుండా పాస్‌పోర్టు కార్యాలయానికి ఏ అధికారంతో లేఖ రాశారని ఏసీబీని ప్రశ్నించారు.
ఏసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్టు జప్తుకు అనుమతి కోరుతూ కింది కోర్టులో మెమో దాఖలు చేయడం ద్వారా సమాచారాన్ని తెలియజేసినట్లు వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పాస్‌పోర్టు జప్తు ప్రొసీడింగ్స్‌తోపాటు షోకాజ్‌నోటీసుపై యథాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
